హైదరాబాద్, ఆంద్రప్రభ : నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో యువత తీవ్రవాదం వైపు దృష్టి సారించకుండా అభివృద్ధిని చేపడుతున్నట్లు పాలకవర్గాలు పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న పల్లెసీమల్లో గతఉమ్మడి పానలో మొక్కుబడిగా ప్రారంభోత్సవాలు జరుపుకున్న చిన్ననీటి పారుదల ప్రాజెక్టులకు ఇప్పటివరకు పర్యావరణ, అటవీశాఖ అనుమతులు మసకబారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన దండకారణ్యంలో ఉన్న రిగిజన తాండాలకు, పట్టాభూములకు సాగునీరు, తాగునీరు అందేంచేందుకు ప్రాజెక్టు ప్రణాళిక రచించారేకానీ పనుల్లో వేగం పెరగకపోవడం, ఉపాధి అవకాశాలు కరువైపోవడంతో తరాలుమారినా వారి బతుకులు మారడం లేదు.
సాగునీటి సౌకర్యాలను కల్పిస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటుగా రైతులకు బతుకు బరోసా ఉంటుందనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం ప్రభుత్వ రంగసంస్థలనుంచి అనుమతులు లభించకపోవడంతో ముగులుగు జిల్లాలోని మోతి కుంటవాగు సంవత్సరాతరబడిన నిర్మాణానికి నోచుకోవడంలేదు. సమస్యల వలయంలో చిక్కుకున్న ములుగుజిల్లాలోని వాజివీడు మండలంలో కృష్ణా పురం గ్రామ సమీపాన గోదావరి నదీ ఉపనదీ మోతికుంట వాగుపై నిర్మాణం తలపెట్టిన రిజర్వాయర్ సమస్యల వలయం నుంచి బయటకురాలేదు. ఈ జలాశయం తో 13.591 ఎకరాలకు సాగునీరు, వాజివీడు మండలంలోని 1200 జనాభకలిగిన 35 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు గత వైఎస్సార్ పాలనలో 25మే2005న శంకుస్థాపన జరిగింది.
ఈ ప్రాజెక్టుకుఆనాడు జీఓ. ఆర్టీ .నం-64 ఎల్ అండ్ సిడిఎ మీడియం ఇరిగేషన్ ద్వారా రూ. 124.60 కోట్ల పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. లాంఛనప్రాయంగా మొదటి దశ పనులు ప్రారంభించినప్పటికీ పర్యావరణ అనుతులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రెండవ దశపనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.అయితే ఎళ్లతరబడి నిలిచిపోయిన ఈ జలాశయాన్ని నిర్మించాలనేపట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సవరించిన అంచెనాలమేరకు రూ. 527.66 కోట్ల ప్రతి పాదనలను సిద్ధం చేసింది. సిమెంట్ పనులు
ప్రారంభించేందుకు టెండర్లను కూడా ఖరారు చసింది. అయితే పర్యావరణం, అటవీశాఖ అమతుల కోసం డిపిఆర్‌ను సిద్ధం చేసి సంబంధింత శాఖలకు సమర్పించి నప్పటికీ ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో ఎంతో ఉన్నతాశయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దట్టమైన అడవిప్రాంతంలో పూపుల్స్ వార్ నక్సలిజం ప్రభావం ఉన్ననాటి నుంచి మావోయిస్టుల ప్రభావం వరకు ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి తలపెట్టిన ప్రాజెక్టుపనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న అటవీశాఖ అనుమతి కోసం ఇకా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు నిరీక్షించాల్సి వస్తుందో వేచి చూడాలి.
అటవీ శాఖ, పర్యావరణ అనుమతులు సాధించేందుకు కృషి..
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారంతో పాటుగా జలవనరులను సంవృద్ధిగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి చెప్పారు. మారుప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందిచే సంకల్పంతో ప్రారంభించిన చిన్ననీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల అనుమతులు లభించడంలేదని ఆయన వాపోయారు. ప్రధానంగా అటవీ శాఖ, పర్యావరణ శాఖ అనుమతులు లభిస్తే అనేక చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు.
త్వరలోనే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటుచేసి మోతి వాగు జలాశయం తో పాటుగా కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర ప్రాంతాల్లో అటవీ శాఖ, పర్యావరణ అనుమతులులేక నిలిచిపోయిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు కృషిచేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించినా, నీటి లభ్యత ఉన్నా అనుతులు లభించక నిలిచిపోయిన ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.