హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. బుధవారం ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో సర్వర్ సమస్య తలెత్తడంతో సంబంధిత కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీఏ వెబ్‌సైట్‌లో పాత, కొత్త వాహనాల వివరాలు కనిపించడం లేదని వాహనదారులు వాపోయారు. తమ కొత్త వాహనాలకు సంబంధించి స్లాట్‌లు బుక్ చేసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేక పోయామని తెలిపారు.
కాగా, వాహనాల రిజిస్ట్రేషన్ల సమస్యపై ఆర్టీఏ అధికారులు స్పందించారు. బుధవారం స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కాని వాహనదారులకు మరొక రోజు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దానికి సంబంధించిన పనులను సంబంధిత శాఖ చేపడుతుందనీ, వీలైనంత త్వరలోనే సర్వర్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గురువారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ల పనులు యధావిధిగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.