Tuesday, November 26, 2024

Tirumala: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల బుక్‌లెట్లు ఆవిష్కరించిన ఈవో.. వాహ‌న సేవ‌లు ఇవే..

తిరుమల (ప్రభన్యూస్​): తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాల‌ వాహ‌న‌సేవ‌ల‌ బుక్‌లెట్లను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి. ధ‌ర్మారెడ్డి ఆవిష్క‌రించారు. బుధ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ఈవో ఆఫీసులో వీటిని ఆవిష్క‌రించారు. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌రకు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.

సెప్టెంబ‌రు 26వ తేదీన రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా ముఖ్యంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్స‌వం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, న్యాయాధికారి రెడ్డెప్ప‌రెడ్డి, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో క‌స్తూరి బాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వాహనసేవల వివరాలు :

  • సెప్టెంబరు 27న మొద‌టి రోజు సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేష వాహనం.
  • సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహనం.
  • సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ముత్యపు పందిరి వాహనం.
  • సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహనం.
  • అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనం.
  • అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ర‌థ‌రంగ డోలోత్సవం(స్వ‌ర్ణ‌ రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు గజ వాహనం.
  • అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనం.
  • అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహనం.
  • అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ధ్వజావరోహణం.
Advertisement

తాజా వార్తలు

Advertisement