తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో చోరీ ఘటన కలకలం రేపింది. శ్రీవారి ఆలయంలోని హుండీలోని డబ్బుల్ని ఓ యువకుడు దొంగిలించాడు. మూడు రోజుల క్రితం ఘటన జరగ్గా.. తాజాగా బయటపడింది. ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలో డబ్బుల్ని ఓ యువకుడు దొంగలించే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో కొంత డబ్బుల్ని తీసి అక్కడి నుంచి పారిపోగా.. ఈ చోరీ సీన్ మొత్తం హుండీ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ విషయాన్ని శ్రీవారి ఆలయంలో భద్రతా సిబ్బంది గమనించి సీసీ ఫుటేజ్ ఆధారంగా యువకుడిని గుర్తించి గాలించారు. ఆ యువకుడ్ని అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. ఆ యువకుడు చేసిన నేరాన్ని ఒప్పుకోగా.. అతడి దగ్గర నుంచి రూ. 13,870 డబ్బుల్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన యువకుడు తమిళనాడులోని శంకరన్ కోవిల్కు చెందిన వేణు లింగంగా గుర్తించారు. ఆ తర్వాత అతడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించగా.. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.