తిరుమల ప్రభన్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవారి అర్జితసేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్‌కోసం ఈనెల 22 వ తేది ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందినవారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవ టికెట్ల కోటాను రేపు ఉదయం 11.30 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే శ్రీవాణి ట్రస్టుకు టికెట్లకు సంబంధించిన జూలైనెల ఆన్‌లైన్ కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
అదేవిధంగా ఈనెల 21 న జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 21 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 21 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. కాగా వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన మే నెల కోటాను ఈనెల 24 న ఉదయం 10 గంటలకు జూన్ నెల కోటాను ఈనెల 24 న మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆనెల 25 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమలలో మేనెల గదుల కోటాను ఈనెల 26 న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మేనెల గదుల కోటాను ఈనెల 27 న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్‌చేసుకోవాలని టిటిడి కోరడమైనది.