Monday, November 25, 2024

నిండుకుండలా శ్రీశైలం.. పూర్తిస్థాయికి చేరిన డ్యాం నీటిమట్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీశైలం రిజర్వాయర్‌ జలకళతో తొణకిసలాడుతోంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ ఏడాది జులైలోనే శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిగా నిండిందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది వర్షాకాలం చివరలో శ్రీశైలం రిజర్వాయర్‌ పూర్తిస్థాయి జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు లో 201.20 టీఎంసీల నీరు ఉండగా… ఎగువ నుంచి 1, 19, 980 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డ్యాం మూడు గేట్లను ఎత్తి వరదను దిగువకు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 6, 7, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి సుమారు 1, 08, 956 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.12వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వస్తోంది. జూరాల నుంచి 81 వేల క్యూసెక్కులు, సంకేశుల నుంచి 31వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలం నుంచి వరద కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌ డ్యాంలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలో 183. 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వదిలిన వరద వచ్చి చేరుతోంది.

ఎగువ నుంచి భారీగా తగ్గిన వరద…

ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అలమట్టి శ్రీశైలం దిశగా వరద గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అలమట్టి కి 20వేల క్యూసెక్కుల వరదనే వస్తుండగా కేవలం 6వేల క్యూసెక్కులు మాత్రమే దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి దిగువకు చుక్క నీరు కూడా విడుదల కావడం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement