హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా నదిపై ఎగువన కర్ణాటకలో ఉన్న అలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర రిజర్వాయర్‌లు నిండడంతో… వరద శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతోంది. రెండు రోజుల్లో శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి రానుంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి మట్టం 159.76 టీఎంసీలకు చేరుకుంది. అలమట్టి నుంచి వరద కాస్తా తగ్గుముఖం పట్టినా… ఇప్పటికీ లక్ష 25వేల క్యూసెక్కుల వరద అక్కడ నుంచి వస్తుండగా… ఇప్పటికే నారాయణపూర్ నుంచి లక్ష క్యూసెక్కులు, జూరాల నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరదతో ప్రతి రోజూ 36 టీఎంసీల మేర నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి కల్లా శ్రీశైలం రిజర్వాయర్ నిండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు 3, 00, 230 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్‌కు 26404 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం భారీ వర్షాల తర్వాత ఉగ్రరూపం దాల్చి ఊళ్లకు, ఊళ్లను ముంచెత్తిన గోదారమ్మ క్రమంగా శాంతిస్తోంది. గోదావరికి మళ్లిd వరద పోటు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రతోపాటు తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌కు 39530 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా… గేట్లు ఎత్తి 22104 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.31టీఎంసీలు కాగా… ప్రస్తుతం 76.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 8481 క్యూసెక్కుల వరద వస్తోంది. గేట్లు కిందకు దించే అవకాశం లేకపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్లుగానే దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 2,00, 946 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. అంతేస్థాయిలో ఔట్ ఫ్లో కొనసాగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.