Thursday, November 21, 2024

Big story | కాళేశ్వరం జలాలతో నిండుతున్న శ్రీరాంసాగర్‌.. నిరంతరంగా నీటి ప్రవాహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గలగల పరుగులు తీసే గోదావరి దక్కన్‌ పీఠభూమిలో ఎదురెక్కి శ్రీరాంసాగర్‌ చేరుతున్న దృశ్యాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని పలుప్రాంతాలనుంచి పర్యాటకలు కిక్కిరిసి పోతున్నారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవన పథకంలో భాగంగా కాళేశ్వరం జలాలు దిశను మార్చుకుని 112కి,మీ.ప్రయాణించి శ్రీరాంసాగర్‌ లో పరవళ్ళు తొక్కుతున్న అద్భుత దృశ్యం కనువిందు చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో బీటలు బారిన శ్రీరాంసాగర్‌లో కాళేశ్వర జలాలు ఊపిరి పోస్తున్నాయి. 1963 లోజూలైలో నాటి ప్రధాని నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1970లోనాటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ప్రారంభించగా సమైక్యపాలకులు నిర్లక్ష్యంలో భాగమై బీడుబారిపోయింది.

అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా సీఎం కేసీఆర్‌ శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకాన్ని ప్రారంభించి గమ్యానికి చేర్చారు. రూ.1999 కోట్ల 56 లక్షలతో శ్రీరాంసాగర్‌ పునరజ్జీవ పథకాన్ని పూర్తి చేసి సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు. సముద్ర మట్టానికి సుమారు 400మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీరాంసాగర్‌ కు అంతకంటే ఎత్తులో ఉన్న మహారాష్ట్ర బాబ్లి నుంచి గోదావరి జలాలు వచ్చేవి అయితే బాబ్లి ప్రాజెక్టు నిర్మించగా వరదప్రవాహానికి అడ్డుకట్ట పడటంతో ఆందోళనలో ఉన్న రైతులు కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్‌ ను నింపుతుండటంతో సీఎం కేసీఆర్‌ కు క్షీరాభిషేకాలు చేయడంతో పాటు గోదావరమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

- Advertisement -

చినుకు జాడలేక ఆందోళన పడుతున్న అన్నదాతలకు కాళేశ్వర జలాలు కల్పతరువుగా మారాయి. ఉత్తరతెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఏప్రాజెక్టు నీటి కొరత ఉన్నా కాళేశ్వరం జలాలు ఎదురెక్కి ప్రాజెక్టులు నింపడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతల్లో ఒకటి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోయిన శ్రీరాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు జీవంపోస్తున్నాయి. 16లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు ఏనాడు లక్ష్యానికి చేరువకాలేదు. అయితే ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో ఖరీఫ్‌ లో 16లక్షలకు పైగా శ్రీరాంసాగర్‌ ఆయకట్టు రైతులు సేద్యం చేసేందుకు సిద్ధమయ్యారు.

శ్రీరాంసాగర్‌ వరదకాలువనుంచి ఎదురెక్కి సాగర్‌ చేరుకుంటున్నాయి. మొదట 23వేల200 క్యూసెక్కుల వరదనీరు లక్ష్మీ బరాజ్‌ కు చేరుకుంది. అక్కడినుంచి ఆనీటిని గాయత్రి పంపుహౌస్‌ కు తరలించారు అక్కడి నుంచి 73వ మైలు రాయిదగ్గర రాంపూర్‌ పంపుహౌస్‌ నుంచి 4మోటర్ల ద్వారా మొత్తం 9,450 క్యూసెక్కుల నీరు మెట్‌పల్లి మండలంలోని రాజేశ్వరరావు పేట దగ్గర నిర్మించిన పంపు హౌస్‌ కు చేరుకున్నాయి. అక్కడినుంచి 3మోటర్లను ఆన్‌ చేసి 4,3500 క్యూసెక్కులనీరు నిజామాబాద్‌ జిల్లాలోని ముప్కాల్‌ పంప్‌హౌజ్‌ కు విడుదల చేశారు. ఈ పంపుహౌస్‌ లోని 2,3,4,7 పంపులతో నీరు శ్రీరాంసాగర్‌కు చేరుకుంటున్నాయి.

అయితే గాయత్రి పంపుహౌస్‌ చేరుకునే ముందు తొలుత పార్వతి పంపు హౌస్‌ మోటర్లను ఆన్చేసి నందిమేడారం పంపుహౌస్‌ కు చేర్చారు. నందిమేడారం నుంచి గాయత్రి పంపు హౌస్‌ కు నీటిని చేర్చి వరదకాలువ ద్వారా దిశను మార్చుకుని కాళేశ్వరం గంగపరవళ్లు తొక్కుకుని దశలవారిగా ప్రయాణించి శ్రీరాంసాగర్‌ చేరుకుంటున్నాయి.రోజుకు 0.5 టీఎంసీలనీరు శ్రీరాంసాగర్‌ కు చేరుతుంది. ఈ క్రమంలో శ్రీరాంసాగర్‌ లోకి నీటిని ఎత్తిపోసే దృశ్యాలు తిలకించేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. కష్టమచ్చినప్పుడే కాళేశ్వరం జలాల విలువ తెలుస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు అక్షర సత్యాలై ఆచరణకు నోచుకుంటుంటే రైతుల్లో ఆనందం తాండవిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement