Sunday, November 24, 2024

ఢిల్లీలో వైభవంగా సీతారాముల కళ్యాణం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని ఢిల్లీలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీలోని ఐటీఓ, ప్రసాద్ నగర్, పుష్పవిహార్‌తో పాటు అన్ని బ్రాంచులలో గురువారం నవమి వేడుగలు వైభవంగా జరిగాయి. శ్రీరామ కీర్తనలు, భక్తి పాటలతో ఏఈఎస్ పాఠశాలల ప్రాంగణాలు మార్మోగాయి. ఐటీఓ బ్రాంచ్‌లో ఏఈఎస్ పూర్వాధ్యక్షులు ఎమ్‌.వి. రామారావు బృందం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామంతో కార్యక్రమం ఆరంభమైంది.

సొసైటీ అధ్యక్షులు డా. ఎమ్‌.ఆర్‌. మూర్తి, ఉపాధ్యక్షులు ఎస్‌. ఎ. అలీషా, కార్యదర్శి ఎస్‌. ఈశ్వర్‌ ప్రసాద్‌, కో ఛైర్మన్‌ వి. వి రావు, కోశాధికారి వి. ఛటర్జీ, ఎ.ఒ. శివప్రసాద్‌, సభ్యులు, శ్రీధర్‌, శ్రీనివాసరావు,  పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఉపేందర్ చేతుల మీదుగా దేవుడి ఊరేగింపు జరిగింది. తదనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణం  జరిగింది. ఏఈఎస్ యాజమాన్య బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో నవమి వేడుకలు..

ఆంధ్రా అసోసియేషన్ అన్ని బ్రాంచులలో శ్రీరామ కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. న్యూఢిల్లీ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోల్‌మార్కెట్‌లో జరిగిన ఉత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఢిల్లీ తెలుగు పూజా సమితి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణంలో పలు జంటలు పాల్గొన్నాయి. మందిర్ మార్గ్‌లోని ఆలయంలో జరిగిన నవమి సంబరాలను చూడడానికి భారీ ఎత్తున ఉత్తరాది వారూ తరలివచ్చారు. గోల్‌ మార్కెట్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనూ శ్రీరామ నవమి ఉత్సవం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement