Friday, November 22, 2024

శ్రీనగర్‌ – జమ్ము హైవేపై రాకపోకలు బంద్‌.. కాశ్మీర్‌లో భారీ వర్షాలు.. హిమపాతం

శ్రీనగర్‌:భారీ వర్షాలు, మంచు కురియడంతో బుధవారంనాడు జమ్మూకాశ్మీర్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటం, పలు ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రత్యేకించి శ్రీనగర్‌ – జమ్ము 44వ జాతీయ రహదారిపై వేలాది వాహనాలు చిక్కుకుపోయాయి. అమర్‌నాథ్‌ క్షేత్రం సహా అనేక ప్రాంతాల్లో వర్షంతోపాటు పెద్దఎత్తున మంచు కురుస్తోంది. రాకపోకలు పునరుద్ధరించడానికి కనీసం రెండురోజులు పడుతుందని అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఉధంపూర్‌ జిల్లాలోని సమ్‌రోలి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది.

రామ్‌బాన్‌ ప్రాంతంలోని పీరా వద్ద నిర్మాణంలో ఉన్న ధ్వంసమైంది. వరదలువల్ల అనేక ప్రాంతాల్లోని బకేర్‌వాల్‌ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి పశుసంపద, అవి ఉండే ఆవాసాలు దెబ్బతిన్నాయి. మరోవైపు మైదాన ప్రాంతాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉష్ణోగ్రత ఒక్కసారిగా 15 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోయింది. ఇటీవలి సంవత్సరాలలో ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత. ఈనెల 30న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కావలసి ఉండగా ఆ మార్గంలోని గుల్‌మార్గ్‌ వద్ద పది అంగుళాల మేర మంచు కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి వాతావరణం మెరుగుపడటంతో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement