అయిదుగురు ఉగ్రవాదులు హతం
అమరులైన ఇద్దరు జవాన్ లు
ఎన్నికల నేపథ్యంలో భారీగా కూబింగ్
ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న ఆర్మీ
శ్రీనగర్ – జమ్మూకశ్మీర్ లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో వరుసగా ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలోనే మూడుచోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్ పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
బారాముల్లా జిల్లాలో..
బారాముల్లా జిల్లాలోని పట్టాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ నార్తర్న్ కమాండ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
కథువా జిల్లాలో.
అంతకుముందు కథువా జిల్లాలో రైజింగ్ స్టార్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ చేపట్టాయి. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనాస్థలంలో పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు కిష్త్‌వాడ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. వారిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి.