Friday, November 22, 2024

శ్రీలంకన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఫర్‌ సేల్‌.. ప్రైవేటు సంస్థకు అప్పగింత!

కొలంబో : శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంధనం కూడా అందుబాటులో లేదు. పెట్రోల్‌, డీజెల్‌ నిలలు నిండుకున్నాయి. దీంతో ఆర్థికంగా దేశాన్ని గట్టెక్కించేందుకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను విక్రయిస్తామని ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగుల జీతాలు కూడా నిలిచిపోయాయని తెలిపారు. వారికి జీతాలు ఇచ్చేందుకు కరెన్సీ ప్రింటింగ్ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సబ్సిడీలు భరించే స్థోమత ప్రభుతానికి లేదన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయన్నారు. రానున్న మరికొన్ని రోజుల్లో శ్రీలంక దారుణ పరిస్థితి ఎదుర్కోనుందని ప్రధాని చెప్పుకొచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం తనకు ఇష్టం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉందో చెప్పాల్సిన బాధ్యత ఓ ప్రధానిగా తనపై ఉందని వివరించారు.

యుద్ధ ప్రాతిపదికన 75 మిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ అవసరం అన్నారు. మార్చి 2021 నాటికే.. శ్రీలంకన్‌ ఎయిర్‌ లైన్స్‌ 45 బిలియన్‌ రూపీస్‌ (124 బిలియన్‌ డాలర్లు) నష్టాల్లో ఉందన్నారు. ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటు పరం చేసి.. వాటితో వచ్చిన డబ్బులను నిరుపేదల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ప్రకటించారు. 1975లో శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ ఏర్పాటైందని, ప్రపంచ వ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడిపిందన్నారు. 2006 తరువాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని, ఆ తరువాత నష్టాలు మూటగట్టుకున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరెన్సీ ముద్రణ చేసి ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement