Friday, November 22, 2024

గోల్డెన్ అవర్ విశ్వవ్యాపితం కావాలి – శ్రీలంక మంత్రి సతాశివమ్ వియలందేరన్

విజయవాడ, ఆగస్టు 13(ప్రభ న్యూస్): గోల్డెన్ అవర్ ప్రాజెక్టు విశ్వవ్యాపితం కావాలని శ్రీలంక ఆహార భద్రత, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి సతాశివమ్ వియలందేరన్ ఆకాంక్షించారు. ఎంజీరోడ్డులోని హోటల్ లో ఆదివారం జరిగిన గోల్డెన్ అవర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రమాదాల్లో గాయపడిన వారికి, పక్షవాతానికి గురైన వారికి, తల, మెదడు భాగాల్లో తీవ్రమైన గాయాలైన వారికి తొలి గంట వ్యవధిలో చికిత్సనందిస్తే మెరుగైన ఫలితాలను సాధించొచ్చని తెలిపారు. గోల్డెన్ అవర్ గా పేర్కొనబడే మొదటి గంట వ్యవధిలో సంపూర్ణ చికిత్సనందించేలా అత్యాధునిక సదుపాయాలు, అగ్రశ్రేణి వైద్య నిపుణులతో ప్రత్యేక న్యూరో విభాగాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సంజీవని లాంటి గోల్డెన్ అవర్ ప్రాజెక్టును విస్తృతం చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని సతాశివమ్ వియలందేరన్ హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ సంభవించిన వెంటనే సరైన చికిత్సను అందించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని, చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయానికి గానీ, జీవితకాల వైకల్యానికి గానీ దారి తీయవచ్చని అన్నారు. త్వరితగతిన చికిత్స తీసుకోవడం గురించి గోల్డెన్ అవర్ ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ముఖంలో పక్షవాత లక్షణాలు, సరిగా మాట్లాడలేకపోవడం, చేతులు పైకెత్తలేకపోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో వున్న ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక అత్యవసర చికిత్సా విభాగాన్ని నెలకొల్పుతోందని వెల్లడించారు. సదరు క్రిటికల్ కేర్ యూనిట్లలో అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సదుపాయాలు, అత్యవసర చికిత్సలు అందుబాటులో ఉంటాయని కృష్ణబాబు చెప్పారు.

- Advertisement -

అనంతరం, టెమా-సీఎంఎఐ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.కె. గోయల్ మాట్లాడుతూ మొదటి గంటలో సమగ్రమైన చికిత్సలందించి ప్రాణాలను కాపాడటం కోసం చేపట్టిన గోల్డెన్ అవర్ ప్రాజెక్టు విప్లవాత్మకమైనదని ప్రొఫెసర్ గోయల్ కొనియాడారు.

ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గోల్డెన్ అవర్ ప్రాజెక్టు వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు.

బాలీవుడ్ నటీమణులు మౌబానీ సర్కార్, శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారికి, బ్రెయిన్ స్ట్రోక్ తదితర సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి గోల్డెన్ అవర్’ ద్వారా అత్యున్నత శ్రేణి చికిత్సలు ఎంతో మేలు చేస్తాయని వెల్లడించారు. గోల్డెన్ అవర్ లాంటి ఆదర్శవంతమైన కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని వారు తెలియజేశారు

.ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ కె. లలిత, ఇంటర్వెన్షనల్ న్యూరో సర్జన్ డాక్టర్ సుధీర్ సుగ్గల, ప్రముఖ బేరియాట్రిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్, ఫార్చ్యూన్ మురళీ పార్క్ సీఎండీ ముత్తవరపు మురళీకృష్ణ, జీన్ పవర్ఎక్స్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ రామ్ ఉప్పలపాటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement