Saturday, November 23, 2024

రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలి: శ్రీకాంత్ రెడ్డి

అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని చంద్రబాబుకు.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చేందుకు సీఎం జగన్ యత్నిస్తున్నారని… కానీ, చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తన వైఖరి ఏమిటో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నీటిని తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు కాబట్టి చంద్రబాబు భయపడ్డారా? అని ఎద్దేవా చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి కేటాయింపులు జరిగినప్పటికీ… విద్యుత్ ఉత్పత్తి పేరుతో నదీ జలాలను తెలంగాణ అక్రమంగా వినియోగిస్తోందని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు అవసరం లేదని దుయ్యబట్టారు. రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, కావాలంటే కేసీఆర్‌తో కూర్చుని మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ తెలంగాణ నేతల నుంచి స్పందన రావడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ వార్త కూడా చదవండి: ఒంగోలు నగరానికి నిరంతరంగా తాగునీరు: బాలినేని

Advertisement

తాజా వార్తలు

Advertisement