Tuesday, November 26, 2024

శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌లో నారా లోకేశ్-అరెస్ట్ చేసిన పోలీసులు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలాస వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు, నాయకులు ఆందోళనకు దిగారు. లోకేశ్‌పాటు మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఇతర నేతలు రోడ్డుపైనే నిరసన తెలిపారు. పోలీసులు, టీడీపీ శ్రేణులకు మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. దీంతో టీడీపీ కార్యకర్తలతోపాటు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్, చినరాజప్ప, కళా వెంకట్రావు తదితరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ పలాస 27వ వార్డు కౌన్సిలర్, టీడీపీ నేత సూర్యనారాయణరాజు ఇళ్లను కూలగొట్టేందుకు పలాస అధికారులు ప్రయత్నించారు. టీడీపీ శ్రేణులు దీనిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు, పలాస ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ గౌతు శిరీష వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నెల 18లోగా ఆమె క్షమాపణలు చెప్పకుంటే 21న టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శిరీష స్పందిచకపోవడంతో వైసీపీ నేతలు ఈ ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంకోవైపు, తాము పార్టీ కార్యాలయంలోనే ఉంటామని, ఎలా ముట్టడిస్తారో చూస్తామని గౌతు శిరీష సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ సూర్యనారాయణను పరామర్శించేందుకు లోకేశ్ పలాస పర్యటనకు బయలుదేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు శ్రీకాకుళం సమీపంలో లోకేశ్‌ను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement