కొలంబొ: టూరిజం అభివృద్ధికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం ప్రోత్సాహకరమైన నిర్ణయం తీసుకుంది. భారతీయులతోపాటు 34 దేశాల పౌరులకు వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాతోపాటు యూకే, యూఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలున్నాయి.
అక్టోబర్ 1నుంచి అమలులోకి వచ్చే ఈ వీసా ఫ్రీ ప్రవేశాలు ఆరు నెలలపాటు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు శ్రీలంక టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. ఐవీఎస్-జీబీఎస్, వీఎఫ్‌ఎస్ గ్లోబల్ నిర్వహిస్తున్న ఈ-వీసా పోర్టల్‌ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో తాజా నిర్ణయం వచ్చింది.
భారతీయులకు ఉచిత వీసా గడువు పొడిగింపు 2024 మే 1న ముగిసినందున, ఈ-వీసా అందుబాటులో ఉండేది. ఇప్పుడు దానిని రద్దుచేసినందున, భారతీయులు అక్టోబర్ 1 వరకు వీసా-ఆన్ అరైవల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. భారతీయులకు ప్రస్తుతం వీసా రుసుము 50 డాలర్లుగా ఉంది. ఇక శ్రీలంక సందర్శించే పర్యాటకుల్లో భారతీయులే అధికం.
2023లో శ్రీలంక టూరిస్టుల్లో భారతీయులు 60శాతం ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ వీసాతో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తొలిసారా అక్టోబర్ 2023లో భారతీయుల కోసం శ్రీలంక వీసా ఫ్రీ విధానం తీసుకొచ్చింది. దీనిని 2024 మే 1 వరకు పొడిగిస్తూ వచ్చింది. 2024లో 2,46,992 మంది భారతీయులు శ్రీలంకకు వెళ్లారు. గత ఆరునెలల్లో పర్యాటకం ద్వారా శ్రీలంక 1.5 బిలియన్ డాలర్లు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో 875 మిలియన్ డాలర్లు పొందింది.
శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత్. యూకే, చైనా, యూఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, పోలాండ్ తదితర దేశాల పౌరులకు వీసా ఫ్రీ ప్రయోజనం లభించనుంది. వీసా రహిత దేశాలకు వెళ్లేప్పుడు కస్టమ్స్ ద్వారా పాస్‌పోర్టు ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని దేశాలు అదనపు ధ్రువీకరణ పత్రాలు కూడా అడుగుతుంటాయి.