భారత్-శ్రీలంక మధ్య నేడు జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 240 పరుగులు చేసింది. అనంతరం, చేజింగ్‌కు దిగిన టీమిండియాకు శ్రీలంక బౌలర్ జెఫ్రే వాండర్సే వరుస వికెట్లు తీసి బిగ్ షాకిచ్చాడు. దీంతో భారత జట్టు 208 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆతిథ్య జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేసింది.
కాగా, శ్రీలంక నిర్దేశించిన 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (65) పవర్ ప్లేలో లంక బౌలర్లను ఉతికి ఆరేస్తూ వరుసగా రెండో అర్ధ సెంచరీతో రాణించాడు. శుబమన్ గిల్ (35) పరగులుతో పరువాలేదనిపించినా… శ్రీలంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే (6/33) భారత జట్టు టాపార్డర్ ను కుప్పకూల్చాడు.
స్టార్ ఆటగాళ్లంతా డగౌట్‌కు చేరినవేళ అక్షర్ పటేల్ (44), వాషింగ్టన్ సుందర్(15)లు అసమాన పోరాటం చేశారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో ఓటమి దాదాపు ఖాయమైంది. కుల్దీప్ యాదవ్ (7), సిరాజ్ (4) కాసేపు ప్రతిఘటించినా అసలంక (3/20) ధాటికి చేతులెత్తేశారు.
టాస్ గెలిచిన శ్రీలంక రెండో వన్డేలో పోరాడగలిగే స్కోర్ చేసింది. ఓ దశలో భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40) రాణించగా.. గత మ్యాచ్ హీరో దునిత్ వెల్లలాగే(39) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.