Thursday, November 21, 2024

శ్రీలంక మార్కెట్‌ 5 రోజులు మూసివేత.. కొలంబో స్టాక్‌ ఎక్స్ఛేంజీ ప్రకటన..

శ్రీలంక ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొంత కాలం పాటు ఇతర దేశాల అప్పులు చెల్లించలేమని ఆ దేశం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీ అయిన కొలంబో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ శనివారం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌ 18 నుంచి ఐదు రోజుల పాటు ట్రేడింగ్‌ జరగదని తెలిపింది. శ్రీలంకకు చెందిన సెక్యూరిటీస్‌ కమిషన్‌ కొలంబో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. శ్రీలంకలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ డైరెక్టర్ల బోర్డు, ఇతర వాటాదారుల నిర్ణయం మేరకు మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఎస్‌ఈసీ వారు పేర్కొనన కారణాలను జాగ్రత్తగా పరిశీలించి.. స్టాక్‌ మార్కెట్‌పై దేశంలోని ప్రస్తుత పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసిందని ఈ ప్రకటన పేర్కొంది.

ఐఎంఎఫ్‌కు రుణ వేడుకోలు..

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ఇతర రుణ దాతల నుంచి 4 బిలియన్‌ డాలర్ల సాయం కోసం శ్రీలంక ప్రతినిధి బృందం వాషింగ్టన్‌ను ఆశ్రయించింది. దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపింది. ఈ కారణంగా శ్రీలంకలో ఆహారం, ఇంధనం కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కూడా ఏర్పడింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 81 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ రుణాల చెల్లింపులను నిలిపివేసి.. నిత్యావసర వస్తువులు, ఇంధనం దిగుమతి కోసం ఫారెక్స్‌ను ఆదా చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement