ప్రభ న్యూస్, అమీర్‌పేట్ : శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలకు రహదారులే పార్కింగ్ అడ్డాలుగా మారిపోతున్నాయి. దీంతో ఆయా కళాశాలల పరిసర ప్రాంతాల్లో నిత్య జీవన పోరాటానికై రోడ్డెక్కే వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థ లు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నామంటూ వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్‌నగర్ – బాపూనగర్ ప్రధాన రహదారిపైనే ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వీరు బస్సులు నిలుపుతున్న ప్రాంతానికి కూతవేటు- దూరంలోనే ఎస్సార్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టే షన్ ఉన్నప్పటికీ, కనీసం తమ అవస్థలను పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
రోడ్లపైనే అక్రమ పార్కింగ్..
ఎస్సార్‌నగర్ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న కొన్ని భవనాల్లో గత కొన్నేళ్లుగా శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ భవనాలకు అవసరమైనంత పార్కింగ్ వసతి లేకపోవడంతో ఆయా క ళాశాలలకు సంబంధించిన బస్సుల్లో విద్యార్థులను తీసుకొచ్చి, ఆ తర్వాత ఆయా బస్సులను కాలేజీల ముందే రోజంతా రహదారిపైనే పార్కింగ్ చేస్తున్నారు. తిరిగి కళాశాల వదిలే ముందు దాదాపు ప్రధాన రహదారిని కబ్జాచేస్తూ వాటిని రహదారిపైనే నిలువుతారు. తరగతులు అయ్యాక విద్యార్థులు బయటకి వచ్చి, బస్సు ఎక్కే వరకు కొన్ని గంటల పాటు- కళాశాల బస్సులను రహదారిపైనే నిలిపి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడుతున్న ట్రాఫిక్‌జామ్ వల్ల ప్రతిరోజు కొన్ని గంటల పాటు- వాహనాలు రోడ్లపైనే ఎక్కడికక్కడే నిలిచిపోవడం, ఆయా వాహన చోదకులు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడం నిత్యకృత్యంగా మారిపోయింది.
పట్టించుకోని ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసులు..
ఎస్సార్‌నగర్ లోని వసతులు లేని భవనాల్లో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కాలేజీ బస్సుల వల్ల ఇంత పెద్దఎత్తున సమస్య ఏర్పడుతున్నప్పటికీ స్థానిక ట్రాఫిక్ పోలీసులు పట్టించు కోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణకై అధికారులు వస్తున్నారు, బదిలీ మీద పోతున్నారే తప్ప ఏ ఒక్క ట్రాఫిక్ అధికారి కూడా కళాశాలలతో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పట్టించు కోలేదన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఎస్సార్‌నగర్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ వసతులు లేని కళాశాలల జరిగే ఇబ్బందుల దృష్ట్యా శాశ్వత పరిష్కారాలు చూపిన దాఖలాలు ఎక్కడా లేవని వారు మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని, శ్రీచైతన్య, నారాయణ కళాశాలల బస్సులతో ఎదురవతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.