Friday, November 22, 2024

అపోలో ఆస్పత్రుల్లో ‘స్పుత్నిక్ వీ’ టీకాల పంపిణీ

రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ రెండో విడత టీకాలు ఆదివారం నాడు హైద‌రాబాద్‌కు చేరుకున్నాయి. మే 1న తొలి విడత కింద 1.50 లక్షల డోసులు రాగా, రెండో విడతలో భాగంగా ఆదివారం 60 వేల డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈ టీకాల వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హైద‌రాబాద్‌, విశాఖ అపోలో ఆస్ప‌త్రుల్లో చేప‌ట్ట‌నున్నారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ రెడ్డీస్ సీఈవో మాట్లాడుతూ.. స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంద‌న్నారు. మొద‌టి డోసుకు ఇవాళ ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభించామ‌ని తెలిపారు. ట్ర‌య‌ల్ ర‌న్‌లో భాగంగా 50 వేల మందికి టీకాలు ఇస్తామ‌న్నారు. 63 దేశాల్లో స్పుత్నిక్ వి టీకాకు ఆమోదం ల‌భించింద‌ని చెప్పారు. స్పుత్నిక్ వి టీకాపై రూ. 1200 నుంచి రూ. 1250 వ‌ర‌కు వ‌సూలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కాగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తోపాటు భారత్‌లో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ. భారత్‌లో దీని తయారీ, పంపిణీకి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. డాక్టర్‌ రెడ్డీస్‌కు తొలి విడతగా 1.5 లక్షల డోసుల ‘స్పుత్నిక్‌-వీ’ వ్యాక్సిన్‌ ఈ నెల 1న చేరుకుంది. వీటి పంపిణీకి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో గల సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ ఈ నెల 13న అనుమతినిచ్చింది. దీంతో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ‘డాక్టర్‌ రెడ్డీస్‌’ ప్రారంభించింది. డాక్టర్‌ రెడ్డీస్‌లో కస్టమ్‌ ఫార్మా సర్వీసెస్‌ వ్యాపార విభాగ అధిపతి దీపక్‌ సప్రా తొలి ‘స్పుత్నిక్‌-వీ’వ్యాక్సిన్ డోస్ వేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement