ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితుల్లో కరోనా నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషనే. అందులో భాగంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌పై దేశం దృష్టి సారిస్తోంది. దీనికోసం రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే భారత ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే ఇండియాలో లాంచ్ కాబోయే తొలి సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ లైట్ నిలవనుంది.
తాజాగా డీసీజీఐ కూడా వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి పలు దేశాల్లో ట్రయల్స్ జరగడంతోపాటు అనుమతులు కూడా వచ్చేశాయి. వ్యాక్సిన్ వేసిన 28 రోజుల తర్వాత కరోనా వైరస్‌పై 79.4 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ ట్రయల్స్ ప్రధానంగా రష్యన్లపైనే జరిగాయి. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా రష్యా, యూఏఈ, ఘనాలాంటి దేశాల్లో 7 వేల మందికి ఈ వ్యాక్సిన్ వేశారు. స్పుత్నిక్ లైట్‌లాంటి సింగిల్ డోస్ వ్యాక్సిన్ వల్ల దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరుగుతుంది. ఇప్పటికే ఈ స్పుత్నిక్ వి రెండు డోసుల వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడు కన్‌సైన్‌మెంట్లు హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం అత్యధికంగా 30 లక్షల డోసులు ల్యాండయ్యాయి. ఈ టీకాలను ఇండియాలో అపోలో హాస్పిటల్స్ వేస్తున్నాయి. ఒక్కో డోసు ధరను రూ.1195గా నిర్ణయించింది.