Friday, November 22, 2024

విడిపోయి పడిపోయాం – కలసి అడుగేద్దాం – కుర్చీ సాధిద్దాం : ములాయం

ఏకంగా ఇద్దరు కేబినెట్ మంత్రులు పలువురు ఎమ్మెల్యేలను అధికార బీజేపీ క్యాంపు నుంచి లాక్కున్న సమాజ్‌వాదీ పార్టీ, నేతలకు ఆ నమ్మకం కల్గించేందుకు పెద్ద కసరత్తే చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తన రాజకీయ చతురతను ఉపయోగించి చక్రం తిప్పారు. తొలుత తన కుటుంబంలో విబేధాలను సరిదిద్ది, యాదవ్ పరివార్‌ను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. అదే పార్టీకి అత్యంత కీలక ముందడుగుగా మారింది. ఆ తర్వాత ఒకరి వెంట ఒకరుగా అనేక చిన్న పార్టీలు వచ్చి జతకలిశాయి. ‘యాదవ్ పరివార్‌’పై కుదిరిన నమ్మకం ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ నుంచే నేతల వలసలకు బాటలు వేసింది. వయోభారం, అనారోగ్యం వేధిస్తున్నా సరే ములాయం సింగ్ యాదవ్ ఈ మధ్య పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం వారిలో నూతనోత్తేజాన్ని నింపింది. ‘లాల్ టోపీ’తో ప్రమాదమంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎర్ర టోపీ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ములాయం తిప్పికొడుతూ.. ఎర్ర టోపీ అంటే బీజేపీ నాయకత్వం భయపడుతోందని అన్నారు. “బీజేపీ ఆందోళనలో ఉంది. కానీ మీరు (కార్యకర్తలు) ఇంతటితో సంతృప్తిపడొద్దు” అంటూ వ్యాఖ్యానించారు. లక్నోలోనే మకాం వేసిన ములాయం పార్టీ వ్యూహాలు, కార్యాచరణ రూపొందిస్తూ.. ఇప్పటికీ ప్రధాని మార్గదర్శక శక్తిగానే ఉన్నారు.

పార్టీని ముంచిన ‘పరివార్’ విబేధాలు..
2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్, తన అన్న కొడుకు అఖిలేశ్ యాదవ్‌తో విబేధించి సమాజ్‌వాదీ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) పేరుతో ఆయన వేరు కుంపటి పెట్టుకోగా, 2017 ఎన్నికల్లో అటు సమాజ్‌వాదీ, ఇటు ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీలు ఘోరంగా పరాజయం పాలయ్యాయి. నిజానికి సమాజ్‌వాదీ పార్టీ నేతగా ములాయం సింగ్ యాదవ్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినప్పటికీ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, నడిపిస్తూ వచ్చింది మాత్రం అతని సోదరుడు శివపాల్ యాదవేనన్న విషయం అందరికీ తెలుసు. ‘మ్యాన్ ఆఫ్ ఆర్గనైజేషన్’గా పేరున్న శివపాల్ యాదవ్, అఖిలేశ్‌తో విబేధించి బయటకు వెళ్లిపోవడంతో, పార్టీలో చాలామంది బలమైన నేతలు ఆయన వెంట నడిచారు. ఫలితంగా యాదవ్ పరివార్‌లో చీలిక పార్టీలోని అట్టడుగుస్థాయి కార్యకర్తల్లో సైతం గందరగోళానికి దారితీసింది. ఫలితంగా సమాజ్‌వాదీ పార్టీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీ ఘోర పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

ఆరేళ్ల తర్వాత..
అబ్బాయితో విబేధించినా.. బడే భాయ్ ములాయంతో శివపాల్‌కు ఎప్పుడూ విబేధాలు లేవు. వేరు కుంపటి పెట్టినప్పటికీ, తరచుగా అన్నను కలుస్తూ ఉండేవాడు. సఫాయ్ (ఇటావా) గ్రామంలో జరిగే కుటుంబ సమావేశాల్లో శివపాల్ తన సోదరుడికి తగిన గౌరవం ఎప్పుడూ ఇచ్చేవారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పరాజయం తర్వాత బాబాయ్ – అబ్బాయ్ మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం ఎదురవడంతో ఈ సయోధ్య ప్రయత్నాలు మరింత వేగవంతమయ్యాయి. యాదవ్ పరివార్ ఐక్యత అవసరాన్ని శివపాల్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే వచ్చారు. 2022లోనూ మరో ఓటమిని చవిచూసే పరిస్థితిలో యాదవ్ పరివార్ లేదని అందరికీ అర్థమైంది. కుటుంబ విబేధాలకు పరిష్కారం కనిపెట్టాల్సిందేనన్న బలమైన భావన క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తల నుంచి కూడా వ్యక్తమైంది. విబేధాలకు కారణాలేవైనా సరే ‘క్షమించడం – మర్చిపోవడం’ (Forgive & Forget) పద్ధతిని అనుసరించి బాబాయ్ – అబ్బాయ్‌ను ములాయం కలిపారు. దాదాపు ఆరేళ్ల తర్వాత శివ్‌పాల్ – అఖిలేశ్ కలిశారు. శివపాల్ ఇప్పటికీ తన సొంత కుంపటిని సమాజ్‌వాదీలో విలీనం చేయనప్పటికీ, ఆ కూటమిలో చేరి పొత్తుల ద్వారా యాదవ్ పరివార్ ఒక్కటైందన్న సందేశాన్ని పంపారు.

పొత్తులతో ఐక్యతారాగం..
పొత్తుల్లో భాగంగా శివ్‌పాల్ పార్టీ ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా)కు 6 సీట్లు కేటాయిస్తానని అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ తన తండ్రి సాంప్రదాయ సీటైన ఇటావాలోని జస్వంత్ నగర్ నుండి పోటీ చేస్తారని, శివపాల్ బదౌన్‌లోని గున్నౌర్ స్థానానికి మారనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ములాయం కోడలు అపర్ణా యాదవ్‌కు ఈ దఫా కూడా టికెట్ ఇచ్చేందుకు అఖిలేశ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కొడుకు ప్రతీక్ యాదవ్ భార్యే అపర్ణ. 2017లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అపర్ణ, బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమి పాలయ్యారు. ఏది ఏమైనప్పటికీ, ఇప్పుడు జరుగుతున్న సీట్ల సర్దుబాటు కంటే, అన్ని విభేదాలను పక్కనపెట్టి ‘యాదవ్ పరివార్’ ఏకతాటిపైకి రావడమే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement