హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సరిపడినన్ని టార్పాలన్ షీట్లు (ప్లాస్టిక్ పరదలు) అందుబాటులో లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ప్రస్తుతం పలు జిల్లాల్లో అకాల వర్షాలకు రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్పలిన్ షీట్లు అందుబాటులో లేకపోవడంతోనే ధాన్యం తడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
తగినన్ని టార్పలన్ షీట్లు లేకపోవడంతో పొద్దంతా ఎండబోసిన ధాన్యాన్ని కుప్పగా చేస్తున్న రైతులు తమకు అందుబాటులో ఉన్న ఫ్లెక్సీలు, పాత చీరలు కప్పాల్సి వస్తోంది. అయితే రాత్రి సమయంలో ఈదురుగాలులతో వీచే అకాల వర్షాలకు అరొకర రక్షణగా ఉన్న ఫ్లెక్సీలు ధాన్యం తడవకుండా ఆపలేకపోతున్నాయని పలు ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా తగినన్ని టార్పలన్ షీట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే సమయంలో నిబంధనల ప్రకారం 17శాతం తేమ ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నా పలు చోట్ల 15శాతం తేమ వచ్చే వరకు ధాన్యాన్ని ఆరబోయాలని నిబంధన అమలు చేస్తుండడంతో అకాల వర్షాల బారిన తమ ధాన్యం చిక్కుకుంటోందని రైతులు వాపోతున్నారు.
మెదక్ జిల్లాలో అకాల వర్షం… పంట నష్టం…
మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి చేతికంద వచ్చిన పంట నాశనమయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది.
చేతికొచ్చిన పంట కళ్లముందే అకాలవర్షాలకు తడిసిపోవడం, దెబ్బతినడంతో రైతులు క న్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
రాగల రెండు రోజులు వర్షాలు…
తెలంగాణలో రాగల రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది.
మరింత పెరగనున్న ఎండలు..
అదే సమయంలో రెండు రోజుల తర్వాత తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 42 డిగ్రీల సెంటీ-గ్రేడ్ వరకూ నమోదవుతాయని తెలిపింది. మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది.
కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో పగటి ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగినా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.