Tuesday, July 2, 2024

SPL STORY | రేవంత్ సర్కారు సరికొత్త నిర్ణయం.. ఊరూరా.. మీ సేవా!

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మహిళల ఉపాధికి సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే క్యాంటీన్లను నిర్వహించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి మహిళలకు అప్పగించారు. ఈ క్రమంలో మరో కొత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆన్​లైన్​ సేవలను వినియోగించుకునేందుకు ఈ చాన్స్​ ఇస్తున్నట్టు సమాచారం.

ఆన్​లైన్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్​కు చెందిన వందలాది సేవలందిస్తున్న మీ సేవా కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఆగస్టు 15లోపు ప్రారంభించాలని..

ఆగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలని రేవంత్‌ సర్కార్‌ ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవా కేంద్రాలున్నాయి. వీటిలో మూడు వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుండగా… వేయిన్నర వరకే గ్రామాలున్నాయి.

ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌ సేవలు, దరఖాస్తులు , చెల్లింపులు సహా 150 కి పైగా ప్రభుత్వ, 600కు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు, నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళాశక్తి పథకం కింద మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

- Advertisement -

విలేజ్​ ఆర్గనైజేషన్​ కోసం..

విలేజ్‌ ఆర్గనైజేషన్‌ పేరిట మహిళా శక్తి మీ సేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. సెంటర్​ ఏర్పాటుకు ₹2.50 లక్షల రుణాన్ని స్త్రీ నిధి ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ మంజూరు చేస్తుంది. వీటితో ప్రభుత్వాధికారుల పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్‌, బయోమెట్రిక్‌ పరికరాలు , కెమెరా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కొనుగోలు చేయాలి. కేంద్రాలు ప్రారంభమైన తర్వాత మహిళా సంఘాలు రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఆపరేటర్ల ఎంపిక, శిక్షణకు చర్యలు..

స్త్రీనిధిలో స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక అంగన్వాడీ కేంద్ర భవనాలు , ఇతర ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో మీ సేవ కేంద్రానికి 10 అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో వసతి కల్పిస్తారు. ఈ నెలాఖరు వరకు ఆపరేటర్ల ఎంపిక అనంతరం వారికి నెలరోజుల పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement