Friday, November 22, 2024

Spl Story : తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్‌!

  • 6.59 లక్షలతో జిల్లా ముందువరుసలో
  • వాణిజ్య రాజధాని ముంబాయ్‌ని వెనక్కి నెట్టిన వైనం
  • ఏటా పెరుగుతున్న తలసరి ఆదాయం
  • ఐటీ పరిశ్రమలు, రియల్‌ ప్రభావమే
  • 111 జీవో ఎత్తివేతతో మరింతగా పెరగనున్న ఆదాయం
  • మూడవ స్థానంలో నిలిచిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది..పెద్దపెద్ద నగరాలకు వెనక్కి నెట్టి తలసరి ఆదాయంలో జిల్లా ముందువరుసలో నిలిచింది. దేశ వాణిజ్య రాజధాని కంటే రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా విస్తరించి ఉండటం రికార్డు స్థాయిలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు కావడం, రియల్‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.6.59 లక్షలకు చేరింది. ఇది దేశంలోనే రికార్డుగా మారింది. .మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ఇక్కడ తలసరి ఆదాయం రూ.2.40 లక్షలకు చేరింది.

ఒక ప్రాంతంలో మనిషికి లభించే ఆదాయమే తలసరి ఆదాయం. అన్ని రకాలుగా వచ్చే ఆదాయాన్ని లెక్కించి జనాభాతో భాగించగా వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు. జిల్లాలో తలసరి ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత రికార్డు స్థాయిలో ఐటీ కంపనీలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దానికి తోడు ప్రధాన ఆదాయం భూముల క్రయావిక్రయాల ద్వారా లభిస్తోంది. నేడు మారుమూల గ్రామంలో కూడా రియల్‌ వ్యాపారం చేస్తూ దండిగా సంపాధిస్తున్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. నగరాల విషయానికి వస్తే దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో తలసరి ఆదాయం రూ. 6.59లక్షలకు చేరింది. ప్రముఖ నగరాలను కూడా రంగారెడ్డి జిల్లా మించిపోయింది. ముంబాయ్‌, మద్రాసు, బెంగుళూరు వంటి ప్రధాన నగరాలు కూడా వెనకబడిపోయాయి. రంగారెడ్డి జిల్లా చుట్టూరా 50 కిలోమీటర్ల వరకు విస్తరించింది. హైదరాబాద్‌కు చుట్టూరా ఉండటంతో ఇక్కడ రికార్డు స్థాయిలో ఐటీ కంపనీలు ఏర్పాటవుతున్నాయి. దానికితోడు రియల్‌ ప్రభావం నేపథ్యంలో కూడా తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఐటీ ఉద్యోగులతోపాటు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి లభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కూలీలు వలస వచ్చి ఇక్కడ ఉపాధిని పొందుతున్నారు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల వరకు రియల్‌ ప్రభావం నెలకొంది. ఈ ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో కూడా తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ జిల్లా దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 2.40లక్షలకు చేరింది.

111జీవో ఎత్తివేయడంతో మరింతగా పెరిగే ఛాన్స్‌….
84 గ్రామాలకు గుడిబండగా మారిన 111జీవోను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. ఈ గ్రామాల పరిధిలో 1.32లక్షల ఎకరాల భూములున్నాయి. జీవోను పూర్తిగా ఎత్తివేయడం 84 గ్రామాలకు హెచ్‌ఎండీఎ పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో రియల్‌ వ్యాపారం మరింతగా పెరగనుంది. ఎన్నికల ఇయర్‌ కావడంతో భూముల క్రయావిక్రయాలు కాస్త మందగించాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే రియల్‌ వ్యాపారం ఒక రేంజికి చేరుకుంటుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిసారి ఎన్నికల సమయంలో రియల్‌ వ్యాపారం మందగించడం పరిపాటే. భూములు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇళ్ల క్రయావిక్రయాలు కాస్త తగ్గుతాయి. కాకపోతే ధరలు మాత్రం తగ్గించి విక్రయాలు చేసేందుకు వ్యాపారులు ఏమాత్రం ముందుకు రాని పరిస్థితులు. జీవో ఎత్తివేసిన నేపథ్యంలో తలసరి ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 84 గ్రామాలు హైదరాబాద్‌ మహానగరానికి కూతపెట్టు దూరంలో ఉన్నాయి. రవాణా సౌకర్యం కూడా ఉండటంతో ఈ ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం భారీగా పెరగనుంది. మొత్తం మీద తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్‌ వరుసలో నిలబడింది. రానున్న రోజుల్లో తలసరి ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement