Friday, November 22, 2024

Spl Story : రాజకీయ అస్త్రంగా ధరణి !

  • నూతన విధానంలో రిజిస్ట్రేషన్లు.. ముటేషన్‌ సులువు
  • భద్రంగా వ్యవసాయ భూముల రికార్డులు
  • వెనువెంటనే కొత్త పాస్‌ పుస్తకాల జారీ
  • పాత విధానం తలచుకుంటేనే భయంభయం
  • సిబ్బంది పొరపాటుతో కొందరు రైతులకు ఇబ్బందులు
  • పరిష్కారంకు నిత్యం పోర్టల్‌లో వెసులుబాట్లు
  • కొందరు అవినీతి అధికారులతో ధరణికి చెడ్డపేరు

(ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన అతి ముఖ్యమైన సంస్కరణల్లో ధరణి విధానం ఒకటిగా చెప్పవచ్చు. అయితే ఈ ధరణి పోర్టల్‌ ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారిపోయింది. అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ ధరణి విధానంను సమర్ధిస్తోంది. ఈ విధానంలో రైతులకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు ముటేషన్‌ వెనువెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా జరుగుతోందని గుర్తుచేస్తోంది. మరోవైపు ధరణి కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి విధానంను రద్దు చేస్తామని..మునుపట విధానంను అమలు చేస్తామని పేర్కొంది. దీంతో అందరి దృష్టి ధరణి పోర్టల్‌పై పడింది. అధికార..ప్రతిపక్ష పార్టీలు ధరణిపై పరస్పర వ్యాఖ్యలు చేయడంతో రైతులలో కూడా చర్చ మొదలైంది.

వ్యవసాయ భూముల డిజిటలైజేషన్‌తో పాటు ఆయా భూముల రిజిస్ట్రేషన్‌..ముటేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధరణి పేరుతో కొత్తగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఈ విధానంను 2020 అక్టోబర్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌తో పాటు ముటేషన్‌ ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్నాయి. వ్యవసాయ భూములకు సంబంధించి అన్ని పనులు కూడా ధరణి ద్వారానే జరుగుతోంది. ఈ పోర్టల్‌లో రాష్ట్రంలోని దాదాపు 60 లక్షల రైతులకు సంబంధించిన భూరికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొత్తం భూమిలో 97.58 శాతం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వివిధ కారణాలతో మిగితా 2.42 శాతం భూములను ధరణిలో నమోదు చేయలేదు. ధరణి విధానంపై అనేక మంది హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఈ విధానం అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పైపెచ్చు లక్షల మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూరికార్డులను డిజిటలైజేషన్‌ చేయడాన్ని హైకోర్టు స్వాగతించింది.

- Advertisement -

2020 అక్టోబర్‌ నుంచి అన్ని వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ధరణి విధానంలోనే జరుగుతున్నాయి. గతంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో జరిగే రిజిస్ట్రేషన్‌లను రెవెన్యూ విభాగంలోని తహసీల్దార్లకు అప్పగించారు. మొత్తం ఆన్‌లైన్‌లోనే భూముల విక్రయాలు జరిగే విధంగా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులు రెవెన్యూ కార్యాలయంకు వెళ్లిన వెంటనే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయడంతో పాటు కొనుగోలు చేసిన వారి పేరిట అట్టి భూమిని బదలాయించి ముటేషన్‌ కూడా చేస్తున్నారు. వెంటనే పాస్‌పుస్తకాలను సైతం జారీ చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇంత పారదర్శక విధానం ఎక్కడా లేదని అనేక సంస్థలు ప్రశంసలు కురిపించాయి. వెంటవెంటనే రిజిస్ట్రేషన్‌..ముటేషన్‌..పాస్‌పుస్తకాల జారీ జరగడంతో విక్రయించిన రైతులు..కొనుగోలు చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను తీసుకవచ్చి తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాల్సి వచ్చేది. సదరు భూమికి సంబంధించిన రికార్డులను కొనుగోలు చేసిన వారి పేరిట బదలాయించేందుకు నెలల సమయం తీసుకునే వారు. ముటేషన్‌ చేసిన తరువాత కొత్త పాస్‌పుస్తకాల కొరకు మరికొన్ని నెలలు వేచి చూడాల్సి వచ్చేది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి అవకాశం ఉండింది. రికార్డుల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉండింది. వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణలో ఉన్న లోపాలను సరిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి విధానంను తీసుకవచ్చారు. అయితే భూముల రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో కొందరు రెవెన్యూ సిబ్బంది చేసిన పొరపాటు కారణంగా కొందరు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిని సరిచేసుకునేందుకు రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. అదే సమయంలో కొందరు అవినీతి అధికారులు రికార్డులను సరిచేసేందుకు పెద్ద మొత్తంలో వసూలు చేయడంతో ధరణి విధానంపై విమర్శలు ప్రారంభం అయ్యాయి. ధరణిలో రికార్డులను సరిచేసుకునేందుకు ప్రభుత్వం నిత్యం వెసులుబాట్లను కల్పిస్తోంది. ఇప్పటి వరకు ధరణిలో మూడు పదులకు పైగా మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది.

గత కొద్ది మాసాలుగా ధరణిపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. తాము అధికారంలోకి వస్తే ధరణి విధానంను రద్దు చేసి పాత విధానంను తీసుకవస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. పాత విధానం అంటేనే రైతులు భయపడిపోతున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌..ముటేషన్‌కు సబ్‌రిజిస్ట్రార్‌ మరియు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులను.. వివిధ స్థాయిలలో అధికారులకు చెల్లించిన మామూళ్లను రైతులు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు ధరణి ద్వారా రైతులకు మేలు జరుగుతున్నట్లు అధికార బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తించింది. దీంతో కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ధరణిని రద్దు చేయడంతో పాటు బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పిన మాటలను అధికార పార్టీ పదేపదే ప్రస్తావిస్తోంది. రానున్న రోజులలో ధరణి రాజకీయ అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement