Friday, November 22, 2024

80 మంది పైలట్లను సెలవుపై పంపిన స్పైస్‌ జెట్‌.. సగం విమానాలనే నడుపుతున్న సంస్థ

స్పైస్‌ జెట్‌ 80 మంది విమాన పైలట్లను సెలవ్‌పై పంపించింది. మూడు నెలల సెలవులో వారికి వేతనాలు ఇవ్వలేమని తెలిపింది. స్పైస్‌ జెట్‌ నాలుగు సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది. ఇప్పుడు ఖర్చులు తగ్గించుకునేందుకు పైలట్స్‌ను సెలవ్‌పై పంపించింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశాలతో స్పైస్‌ జెట్‌ 50 శాతం సర్వీస్‌లను ఆపరేట్‌ చేస్తోంది. సంస్థకు చెందిన విమానాల్లో వరసగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో డీజీసీఏ జులై 27న ఈ చర్య తీసుకుంది. స్పైస్‌ జెట్‌కు మొత్తం 90కి పైగా విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 50 విమానాలనే నడుపుతోంది.

విమాన సర్వీస్‌లు తగ్గిపోవడంతో సంస్థలు మిగులు పైలట్లు ఉన్నారని, అందుకే వేతనంలేని మూడు నెలల సెలవులు ఇచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తాత్కాలికంగా ఖర్చులు తగ్గించుకునేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఏ ఉద్యోగిని తొలగించబోమని తెలిపింది. పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమైన తరువాత వీరంతా డ్యూటీలోకి వస్తారని పేర్కొంది. రానున్న కాలంలో మరిన్ని మ్యాక్స్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను తమ సర్వీస్‌ల్లో చేరనున్నాయని తెలిపింది. ప్పైస్‌ జెట్‌కు 2019లో 316 కోట్లు, 2020లో 934 కోట్లు, 2021లో 998 కోట్లు, 2022లో 1725 కోట్లు నష్టాలను ఎదుర్కొంది.
సెలవులో ఉన్న పెలట్లకు వేతనాలు చెల్లించనప్పటికీ, వారికి ఇతర బెనిఫిట్స్‌ అన్ని అందుతాయని తెలిపింది. 80 మంది సెలవులో ఉన్నా, ప్రస్తుతం 50 శాతం సర్వీస్‌లు నడిపేందుకు అవసరమైన పైలట్లు అందుబాటులో ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement