హైదరాబాద్ సిటీలోని చిన్న చిన్న గల్లీల్లో కూడా వాహనాలు మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా మైనర్లు కూడా వాహనాలు నడుపుతున్నారు. వారికి తోడు తల్లిదండ్రులు కూడా అనుభవించు రాజా అన్నట్లు ప్రతిఒక్కరికీ 350, నుంచి 500 సీసీ బైకులు కొనిపెడుతున్నారు. దీంతో సైలెంట్‌గా ఉండే గల్లీలు కూడా బైకుల మోతతో నిశ్సబ్ధ వాతావరణాన్ని శబ్ధకాలుష్యంతో నింపేస్తున్నాయి. నిబంధనలు మేరకు షోరూం యాజమాన్యుల నుంచి వాహనాలు బయటికి వస్తున్నా.. ఆ తర్వాత వాటికి ఉన్న సైలెన్సెర్లను తొలగించి సౌండ్ ఎక్కువ వచ్చేవాటిని బిగిస్తున్నారు. వాటి మోతతో చెవులు చిల్లులు పడుతున్నా పట్టించుకునే వారు లేరు. విఫరీతమైన సౌండ్స్‌తో ముగ్గురు, నలుగురు కూర్చుని చక్కర్లు కొడుతూ హంగామా చేస్తున్నా అట్లాంటి యువకులను ఎవ్వరూ ఆపే పరిస్థితే లేదు.
మెయిన్ సెంటర్లు, కొన్ని ఎంచుకున్న ప్రదేశాల్లో మకాం వేసి బైకులను ఆపి చలాన్లు వేసే పోలీసులు.. ఇట్లాంటి వాహనాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను పాటించకుండా సౌండ్స్ చేస్తూ ఇష్టమున్నట్టు తిరిగే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పోలీసు శాఖ ఇట్లాంటి ఆకతాయిలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.