న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుపతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్) ఏర్పాటును వేగవంతం చేయాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కేంద్ర ఉన్నతాధికారులను కోరారు. ఈమేరకు ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో నైలిట్ డైరెక్టర్ జనరల్ మదన్ మోహన్ త్రిపాఠితో భేటీ అయ్యారు. తిరుపతిలో నైలిట్ నెలకొల్పేందుకు స్థల సేకరణ, అధ్యయనానికి ప్రతినిధులను పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తిరుపతిలో నైలిట్ కేంద్రాన్ని స్థాపించే ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని డీజీని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి ఆయనను సన్మానించి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన మొమెంటోను కానుకగా అందజేశారు.