Friday, September 6, 2024

TG | స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ వేగ‌వంతం చేయండి : సీఎం రేవంత్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఉన్న ఆటంకాలు ఏమిట‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు.

భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి (ఎస్ఈసీ) నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. అందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల‌కు ఈసీఐ జాబితా పంపింద‌ని, మ‌న‌తో పాటు మ‌రో ఆరు రాష్ట్రాల‌కు మ‌రో వారంలో జాబితాలు పంపిస్తుంద‌ని అధికారులు స‌మాధాన‌మిచ్చారు.

జాబితా రాగానే వెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. వారంలోపే ఆయా స్థానిక సంస్థ‌ల‌కు త‌గిన‌ట్లు ఓట్ల‌ర్ల జాబితాలు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ సైతం నిర్దిష్ట గ‌డువులోగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ‌మోహ‌న్‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శులు చంద్రశేఖర్ రెడ్డి, వేముల శ్రీ‌నివాసులు, సంగీత స‌త్యానారాయ‌ణ‌, అజిత్ రెడ్డి, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ సుద‌ర్శ‌న్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement