హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాదాద్రి క్షేత్ర విమానగోపుర బంగారు తాపడం పనులు వేగం పుంజుకున్నాయి. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రి క్షేత్ర విమానగోపురానికి బంగారు తాపడం పూర్తి అయితే మరింత శోభిళ్లనుంది. అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు బంగారు తాపడం పనుల్లో నిమగ్నమయ్యాయి. అయితే స్వర్ణ పూత పూసేముందు గోపురానికి రాగి మోల్డింగ్ చేయాల్సి ఉంది. ఈపనుల ప్రక్రియ దాదాపుగా 60 శాతం పూర్తి కావడంతో పసిడి పూత పనులపై అధికారులు దృష్టి సారించాయి. రాగి మోల్డింగ్ పనులు పూర్తి అయిన శిల్పాల పై పసిడి పూత పూసేందుకు సాంకేతిక నిపుణులు, స్థపతులు దృష్టి సారించారు.
రెండవ తిరుపతిగా ఖ్యాతి చెందిన యాదాద్రి పునర్ నిర్మాణ పనులను ముఖ్యంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠత్మకంగా పూర్తి చేశారు. 12వ శతాబ్దం నాటీ ఈ స్వయం భూదేవాలయాన్ని కాకతీయుల నుంచి అనేక మంది రాజులు నిర్మాణాలు చేపట్టారు. 1323 కాకతీయ రాజ్యం పతనం అనంతరం అభివృద్ధి నిలిచిపోగా 1959 లో మొదటి సారిగా ఆనాటి పాలకులు తూర్పు రాజగోపురాన్ని నిర్మించారు. అయితే కాలగమనంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతంరం సీఎం కేసీఆర్ ఆలయాన్ని పునర్ నిర్మించారు. తిరుమాడ వీధులు, బాహ్య ప్రాకారాలు, తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమర పంచతల రాజగోపురాలను నిర్మించారు. ఆలయ గర్భగుడిని అత్యంత సుందరంగా, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్మించారు. కాకతీయ, విజయనగర శిల్పరీతులతో 25లక్షల టన్నుల కృష్ణ శిలలతో ఈ నిర్మాణాలు జరిగాయి.
గతంలో ప్రాకారాలు లేని ఈ ఆలయానికి ప్రాకారాలతో పాటుగా క్షేత్ర విమానగోపురాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. అయితే వాస్తు రీతులకు భంగం కలగ కుండా నిత్యం 50 వేల మంది గంటల వ్యవధిలో దర్శనంచేసుకునే అవకాశాలను కల్పిస్తూ నిర్మించిన ఈ ఆలయానికి మరింత అందాన్ని పులుముతూ అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలుత క్షేత్ర విమాన గోపురానికి బంగారు పూత పూసి ఆతర్వాత మరిన్ని ప్రాకారాలకు తుదిమెరుగులు దిద్దాలని యాదాద్రి అభివృద్ధి అథారిటీ నిర్ణయించింది.
స్వర్ణతాపడానికి సర్వం సిద్ధం..
యాదాద్రి క్షేత్ర విమాన గోపురం బంగారు పూతకు 125 కిలోల బంగారం అవసరం అవుతుందని నిపుణులు అంచనా వేయగా ఇప్పటివరకు సుమారు 50 కిలోల బంగారం దాతలు విరాళం ఇచ్చారు. అలాగే అననేక మంది దాతలు గుప్త దానాలు చేయడంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనుమడు హిమాన్షు రావు చేతుల మీదుగా ఒకకిలో 16 తులాల బంగారాన్ని యాదాద్రికి విరాళం ఇచ్చారు. ఇప్పటికే ప్రధానఆలయం గర్భగుడి ముఖద్వారం,కలశాలు, తోరణాలకు బంగారు పూత పూశారు. గర్భాలయం పసిడి కాంతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అయితే విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు మద్రాసుకు చెందిన సంస్థలు టెండర్ ప్రక్రియ దక్కించుకుని పనులు ప్రారంభించాయి. తాపడానికి ముందు విమానగోపురాన్ని రాగి మోల్డింగ్ చేసే ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు సుమారు70 శాతం పూర్తి అయినట్లు అధికారులు అంచనావేశారు. పూర్తి అయిన మోల్డింగ్ లో 56 శిల్పాలు, గోపురాకృతులు ఉన్నాయి.రాగి మోల్డింగ్ పూర్తికాగానే బంగారు పూత ప్రక్రియ ప్రారంభించి సంక్రాంత్రి వరకు పూర్తి చేయాలనే ఆలోచనల్లో అధికారులున్నారు.
విరాళాలకు క్యూ ఆర్ కోడ్
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలు ఇప్పటికే పసిడి పూత కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. బంగారం బదులుగా నగదు విరాళాలు సంవృద్ధిగా వస్తున్నాయి. వీరితో పాటుగా పలువురు సీనీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు బంగారం లేదా నగదు రూపంలో విరాళాలు ఇస్తున్నారు. అయితే బంగారు తాపడం కోసం భక్తులు విరాళాలు ఇచ్చేందుకు యాదాద్రి అభివృద్ధి అథారిటీ ప్రత్యేక ఆన్ లైన్ క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్ కోడ్) ను ప్రవేశపెట్టింది.ఫోన్ పే , గోగుల్ పే ద్వారా భక్తులు విరాళాలు ఇచ్చే అవకాశం కల్పించింది.