Saturday, November 23, 2024

TS | ఈ నెల 5 నుంచి అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రామమందిర అంశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం లోక్‌సభ ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆపార్టీ ఆశిస్తోంది. రామమందిర సెంటిమెంట్‌తో ఇప్పుడు నాలుగు సిట్టింగ్‌ ఎంపీ స్థానాలను నిలుపుకోవడంతోపాటు 10కిపైగా ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని బావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో 10కిపైగా సీట్లను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

ఇందుకు రామమందిర అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని కాషాయదళం ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో బీజేపీ ఉంది. ఈ మేరకు ఈ నెల 5 నుంచి మార్చి 5 వరకు అయోధ్యకు బీజేపీ నేతృత్వంలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తెలంగాణ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లను నడపాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని ప్రతీ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి ఒక్కో ప్రత్యేక రైలును అయోధ్యకు నడిపేలా ప్లాన్‌ ప్లాన్‌ చేశారు.

- Advertisement -

ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000మంది అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించేలా కమలనాధులు సన్నాహాలు చేసినట్టు సమాచారం. వరుసగా 17 రోజులు పాటు- 17 నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అయోధ్యకు బీజేపీ నడిపే ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే రెండు ప్రత్యేక కమిటీలను వేశారు. ఒక కమిటీ తెలంగాణలో రైళ్ల నిర్వహణ ఏర్పాట్లను సమన్వయం చేస్తే… మరో కమిటీ- ఇక్కడి నుండి వెళ్లిన వారికి అయోధ్యలో అన్ని ఏర్పాట్లను సమకూర్చనుంది.

కాగా… లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు, అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్రంలో బీజేపీ జాతీయ నేతలు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో భాజపా జాతీయ నేతల పర్యటనలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 5 నుంచి 8 వరకు భాజపా గావ్‌ చలో-బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటి ప్రచారం చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement