Wednesday, November 20, 2024

Special Story – ప్ర‌పంచ దేశాల్లో ఏక దంతుడు!


భార‌త్‌తోపాటు విదేశాల్లోనూ ప్ర‌త్యేక పూజ‌లు
అడ్డంకులు తొల‌గించే ఆది దేవుడిగా గుర్తింపు
వినాయ‌క చ‌వితిని వైభ‌వంగా నిర్వ‌హిస్తారు
హిందువుల‌తోపాటు ముస్లింలు క‌లిసి చేస‌కునే సంబురం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:

- Advertisement -

వినాయ‌క చ‌వితి రోజున దేశంలోని ప్ర‌ముఖ గ‌ణేష్ ఆల‌యాలు అయిన ముంబయిలోని సిద్ధివినాయక దేవాలయం, మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయం, కేరళలోని మధుర్ మహాగణపతి దేవాలయం, గ‌ణేష్ టోక్ టెంపుల్ గాంగ్‌టక్, త‌మిళ‌నాడు ఉచిలోని పిళ్లయార్ టెంపుల్, ఏపిలోని కాణిపాకం గణపయ్య, త్రినేత్ర గణేష్ రణతంబోర్ లాంటి ఆల‌యాలు అంగ‌రంగ వైభవంగా ముస్తాబవుతాయి.

ఇక‌.. దేశంలోనే కాకుండా ప్ర‌పంచంలో కూడా వినాయ‌కుడిని దేవుడిగా కోలుస్తారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఇండియాలో కాకుండా విదేశాల్లో ప్రసిద్ధి చెందిన వినాయకుని ఆలయాల చ‌రిత్ర‌గ‌తుల‌ను చ‌ద‌వి తెలుసుకుందాం..

పిళ్లయార్ టెంపుల్.. శ్రీలంక

తమిళంలో వినాయ‌కుడిని పిళ్లయార్ అని కొలుస్తారు. అయితే.. భార‌త‌దేశానికి అతి ద‌గ్గ‌ర‌గా ఉన్న శ్రీలంకలో పిళ్లయార్ ఆల‌యాలు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్య‌మైన‌వి అరియాలై సిద్ధివినాయకర్ దేవాలయం, కటరగామ దేవాలయం. ఈ రెండు ఆల‌యాల‌కు అటు శ్రీలంక భ‌క్తుల‌తో పాటు ఇండియా నుంచి భక్తులు వ‌స్తుంటారు.

సూర్యవినాయక దేవాలయం.. నేపాల్

భార‌త‌దేశానికి ప‌క్క‌నే ఉన్న మ‌రో దేశం నేపాల్. అత్య‌ధిక హిందువులు నివ‌సించే దేశం కూడా ఇదే. నేపాల్‌లో కూడా పురాత‌న వినాయ‌క దేవాల‌యం ఉంది. అదే నేపాల్‌లోని భక్తపూర్ జిల్లాలో ఉన్న సూర్య వినాయక దేవాలయం. ఈ ఆలయం నేపాల్ రాజ‌ధాని అయిన‌ ఖాట్మండు స‌రిహ‌ద్దుల్లో ఉంటుంది. దీన్ని నడక మార్గం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. సుదూరప్రాంతాల నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఖాట్మండు లోయలో ఉన్న నాలుగు ప్రసిద్ధ గణేశ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని సూర్య దేవాలయం అని కూడా అంటారు. జలవినాయక గణేష దేవాలయం నేపాల్‌లో ప్రసిద్ధి చెందిన ఆలయం.

శ్రీ సితి వినాయగర్ టెంపుల్.. మ‌లేషియా

మలేషియాలో మురుగ‌న్ టెంపుల్‌తో పాటు మ‌రో ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం ఉంది. అదే శ్రీ సితి వినాయగర్ ఆలయం. మలేషియాలోని సెలంగోర్‌లోని పెటాలింగ్ సమీపంలో ఈ ఆల‌యం ఉంటుంది. ఈ ఆల‌యాన్నే పీజే పిళ్లైయార్ దేవాలయం అని కూడా అంటారు. త‌మిళ ప్ర‌జ‌లు ఎక్కువ ఉండ‌డం వ‌ల‌న ఆ పేరు వ‌చ్చింది. శ్రీ సితి వినాయగర్ రూపంలో వినాయకుడు ఇక్క‌డ పూజలను అందుకుంటాడు.

థాయిలాండ్‌లో..

ఇండియా కాకుండా గ‌ణేషుడి విగ్రహాలు ఎక్కువ ఉన్న మ‌రో దేశం థాయిలాండ్. ఇక్క‌డ ఉన్న హువాయ్ క్వాంగ్ స్క్వేర్‌లోని గణేశ దేవాలయాం చాలా ప్ర‌సిద్ది చెందింది. అంతేగాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం కూడా థాయిలాండ్‌లోనే ఉంది. థాయ్‌లాండ్‌లోని చాచోంగ్‌సావో ప్రావిన్స్ నడిబొడ్డున ఈ విగ్ర‌హం ఉండ‌గా.. ఏటా లక్ష‌లమంది భ‌క్తులు ఈ వినాయ‌కుడిని ద‌ర్శించుకోవ‌డానికి ఇక్క‌డికి వ‌స్తుంటారు.

సెల్వవినాయకర్

నెదర్లాండ్స్ డెన్ హెల్డర్‌లో ఉన్న శ్రీ వరతరాజ సెల్వవినాయకర్ ఆలయం యూరోప్‌లో చాలా ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం. ఈ ఆలయాన్ని 1991లో శ్రీలంక నుంచి వెళ్ళిన తమిళులు నిర్మించారు. హిందూయిజంను ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చేయాల‌ని ఈ ఆల‌యాన్ని వారు నిర్మించారు.

బ్రహ్మ వినాయకుడు.. మయన్మార్

హిందూ మత విశ్వాసాల ప్రకారం మన దేశంలో వినాయకుడు తొలి పూజలందుకుంటాడు. కానీ మయన్మార్ దేశంలో మాత్రం గ‌ణేషుడిని బ్రహ్మ దేవుడిగా భావిస్తారు. ఈ దేశంలో బ్రహ్మదేవుడే వినాయకుడిగా మారాడని నమ్ముతారు. అందుకే ఈ దేశంలోనూ గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

ఇండోనేషియా

ఇండియాలో కాకుండా గ‌ణ‌ప‌తి ఇష్టంగా కొలిచే మ‌రో దేశం ఇండోనేషియా. పేరుకు అత్య‌ధిక ముస్లిం జనాభా ఉన్న దేశం అయిన ఇక్క‌డి ప్ర‌జ‌లు అటు మ‌సిద్‌తో పాటు గ‌ణేషుడి ఆల‌యాల‌కు వెళ‌తారు. ఇక ఇండోనేషియాలోని బాలి దీవిలోనూ అనేక గణపతి దేవాలయాలున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క విద్యా సంస్థ, ఇతర నిర్మాణ సంస్థల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్టిస్తుంటారు. అంతేకాకుండా ఇండోనేషియా కరెన్సీ నోటుపై కూడా గణపతి బొమ్మను చూడొచ్చు. ఇక్కడ కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా ఇవే కాకుండా.. న్యూయార్క్ నగరంలోని శ్రీ మహావల్లభ వినాయక దేవాలయం, అరుల్మిగు నవశక్తి వినాయగర్ ఆలయం, సీషెల్స్ త‌దిత‌ర ఆల‌యాలు ప్ర‌పంచ‌మంతటా ప్ర‌సిద్ది చెందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement