Saturday, November 23, 2024

Special Story: పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం !

  • ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్న పీవో
  • ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు వినూత్న కార్యక్రమం
  • ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలల ప్రాంగాణాలు శుభ్రంగా ఉండాలంటున్న పీవో
  • ఆరోగ్యమే మహాభాగ్యం – ఆరోగ్యమే మన సంపద అనే నినాదం ముందడుగు
  • ఐటీడీఏ పీవో స్పూర్తితో కదలుతున్ని ఇతర శాఖల అధికారులు
  • స్వయంగా చెత్త చెదారాన్ని ఎత్తుతున్న ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌
  • పర్యాటక ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టిన పీవో


చింతూరు, (ఏఎస్‌ఆర్‌ జిల్లా), నవరంబర్‌22, (ఆంధ్రప్రభ): ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం, చింతూరు ఐటీడీఏ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చింతూరు ఐటీడీఏ నూతన పీవో, యువ ఐఏఎస్‌ అధికారి అపూర్వ భరత్‌ తనదైన శైలీలో ముద్రను వేసేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమానికి శ్రీకారం పలికారు. చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాలుగు మండల కేంద్రాలతో పాటు, ఇతర ప్రాంతాలు, గ్రామాల్లో నెలకొన్న అధ్వాన్నపు పారిశుధ్య పరిస్థితులను మెరుగు పరచటంతో పాటు, సీజనల్‌ వ్యాధులను కట్టడి చేసేందుకు దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను పాటించేందుకు ప్రతి శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించటానికి ఐటీడీఏ పీవో సిద్దమయ్యారు. ఈ వినూత్న కార్యక్రమానికి ఐటీడీఏ పీవో ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమంతో నాంది పలికారు.


ప్రధాన ఆంశాలను పరిగణలోకి తీసుకొని….
ఫ్రైడే డ్రైడేలో భాగంగా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే వాటిలో ప్రధాన ఆంశాలను పరిగణలోకి తీసుకొని అపరిశుభ్రత అంశంతో పాటు, నూరు శాతం శానిటేషన్‌, వ్యర్థ పదార్థాల నిర్వహణ, దోమల నిర్మూలన, రక్షిత మంచినీటికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మండల కేంద్రాలు, పంచాయతీలు, గ్రామాలు, కుగ్రామాలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో పారిశుధ్యం ఒకటని భావించి పారిశుధ్య సమస్యల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంబడి చెత్త పోగులు దర్శనమిస్తున్నాయని, డంపింగ్‌ యార్డులు లేకపోవటం వల్ల వ్యర్థపదార్థాల నిర్వహణ సరిగా ఉండటం లేదని గమనించి ఈ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పెట్టడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.


పరిసరాలను శుభ్రపరుస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ….
ఈ డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ పీవో గత నాలుగు వారాల నుండి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం పరిసరాలను శుభ్రపరుస్తూ ప్రజలకు అవగాహాన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ పారిశుద్య కార్యక్రమంలో ఐటీడీఏ పీవో సైతం పాల్గొని చీపురు పట్టుకొని రహదారులను శుభ్రంచేసి పారిశుద్ధ్య కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మాత్రం రోడ్ల వెంబడి చెత్త పోగులను తొలగిస్తున్నారు. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా చర్యలు చేపడుతున్నారు. ఆ మేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

- Advertisement -


పర్యాటక ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం…
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ ఒక అడుగు ముందుకు వేసి కేవలం పరిసరాలను మాత్రమే కాదు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెపుతూ చింతూరు మన్యంలోని పర్యాటక ప్రాంతంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మండలంలోని చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రహదారి వెంబడి, తులసిపాక గ్రామ శివారు ప్రాంతంలో పేరొందిన సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్ద పీవో చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు ఫ్లాస్టిక్‌ సీసాలను, ఫ్లాస్టిక్‌ కవర్లను తన స్వహస్తాలతో తీసి శుభ్రం చేశారు.


పీవో స్పూర్తితో ఇతర శాఖల్లో కదలికలు….
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని గత నెల రోజులుగా నిర్వహిస్తుండటంతో ఆయన స్పూర్తితో ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల్లో సైతం కదలికలు వచ్చాయి. పీవోని ఆదర్శంగా తీసుకొని ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాల చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని తొలిగించి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. అధికారులు పరిసరాలను శుభ్రం చేయడంతో రహదారుల వెంబడి చెత్తను తొలగించడంతో ప్రజల్లో సైతం మార్పు మొదలై తమ గృహాల చుట్టూ చెత్తను తొలిగించుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యువ ఐఏఎస్‌ చేపట్టిన ఈ కార్యక్రమంతో పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement