న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు వచ్చిన మంత్రిని ‘ప్రత్యేక హోదా సాధన విద్యార్థి – యువజన రాష్ట్ర జేఏసీ’ నేతలు కలిసి తమ డిమాండుకు మద్దతు కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక ఇస్తామని నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని, ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో పార్లమెంటులో ఇచ్చిన హామీ అని గుర్తుచేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి అన్నారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నిస్తానని అన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ప్రస్తుత ప్రధాని దానిపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.