కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, ప్రసంగాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
కాగా, జులై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11తో ముగిశాయి. మణిపూర్ హింసపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, విపక్షాల ఇండియా కూటమి మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాలు జరిగాయి. అంతలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఎందుకన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు.