అమరావతి, ఆంధ్రప్రభ: హర్రీ భర్రీ ఉరుకులు పరుగులు ఉండవు.. గుంపులో గోవిందా దర్శనం అసలే ఉండదు…. తిరుమలకు ఎస్‌ఈడీ టిక్కెట్లపై వచ్చే భక్తులు పూర్తిస్థాయి సంతృప్తి చెందేలా ఏపీటీడీసీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఎస్‌ఈడీ టిక్కెట్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రతి భక్తుడికి అవసరమైన సేవలు అందించేలా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం టీటీడీ జారీ చేస్తున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టిక్కెట్‌పై వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పన దిశగా పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్‌ఈడీ టిక్కెట్లున్న భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు వసతి, భోజన సదుపాయాలను కూడా కల్పించనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల పెంపుపై టీటీడీ ఈవోతో సమావేశమైన ఏపీటీడీసీ ఎండీ, ఏపీటీఏ సీఈవో కే.కన్నబాబు తద్వారా వచ్చే భక్తులకు కలిపించనున్న సౌకర్యాలను వివరించారు. మరో వైపు భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు బీఎండీ(బుక్ మై దర్శన్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తిరుమల వస్తున్న ఈ తరహా భక్తులకు సేవలు అందించడంపై బీఎండీ సంస్థ ప్రయోగాత్మక సేవా కార్యక్రమాలు చేపట్టింది. రానున్న రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు ఆటంకాలు లేకుండా స్వామి వారి దర్శనలు చేసుకునేలా భక్తులకు అవసరమైన అన్ని సేవలను పర్యాటక శాఖ అందించబోతోంది. రోజుకు వివిధ సంస్థల నుంచి 5వేల వరకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఏపీటీడీసీ అధికారులు భావిస్తున్నారు.
ఎస్‌ఈడీ టిక్కెట్లు ఇలా..
వివిధ రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు, పర్యాటకాభివృద్ధి సంస్థలకు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కేటాయిస్తుంది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రోజుకు వెయ్యి వరకు రూ.300 ఈఎస్‌డీ టిక్కెట్లు కేటాయిస్తుంటారు. ఎపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ వంటి సంస్థలకు రోజుకు వెయ్యి టిక్కెట్లు, ఏపీటీడీసీ, టీఎస్‌టీడీసీ, కర్నాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల పర్యాటక సంస్థలకు 1250 వరకు టిక్కెట్లు కేటాయిస్తుంటారు. రవాణా సంస్థలు నేరుగా తమ ప్రయాణికులకు టిక్కెట్టుపై రూ.వెయ్యి అదనంగా వసూలు చేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిపిస్తోంది.
ఇదే పర్యాటక సంస్థలైన పక్షంలో వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక భాగస్వామ్య సంస్థలకు కొన్ని కేటాయించి మిగిలిన టిక్కెట్లపై నేరుగా భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఏపీ పర్యాటక సంస్థ ఈ తరహా సేవలు అందించేందుకు ఒక్కొక్క టిక్కెట్టుకు తిరుమల నుంచి తిరుపతి మధ్యలో ప్రస్తుతం రూ.1250 వసూలు చేస్తోంది. గత వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా రవాణా, పర్యాటక సంస్థలకు ఇచ్చే టిక్కెట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. రానున్న రోజుల్లో వీటిని యధావిధిగా పునరుద్ధరించడంతో పాటు ఏపీటీడీసీకి ఇప్పుడున్న టిక్కెట్లపై మరో వెయ్యి వరకు అదనంగా ఇచ్చేందుకు టీటీడీ ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే టీటీడీ ఈవో ధర్మారెడ్డితో ఏపీటీడీసీ ఎండీ కన్నబాబు సమావేశమై చర్చలు జరిపారు.
ఒకే గొడుగు కిందకు..
ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి ఏపీ టీడీసీ శ్రీకారం చుట్టింది. వివిధ రాష్ట్రాల రవాణా సంస్థలు, పర్యాటకాభివృద్ధి సంస్థలతో సమావేశం జరిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాల పర్యాటక సంస్థలు ఏపీటీడీసీ ప్రతిపాదనకు ఆమోదం తెలపగా..ఒకటి రెండు రాష్ట్రాల అధికారులు కొంత వ్యవధి కోరినట్లు తెలిసింది. గతంలోనే తాము వివిధ సంస్థలతో సేవా కార్యక్రమాలపై చేసుకున్న ఒప్పందాలు అమలులో ఉన్నందున వారంతా వ్యవధి కోరినట్లు ఏపీటీడీసీ అధికారులు చెపుతున్నారు. అయితే ఏపీటీడీసీ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. వివిధ సంస్థల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు బుక్ మై దర్శన్(బీఎండీ) సంస్థ ద్వారా అవసరమైన సేవలు అందిస్తారు.
ఇవీ సేవలు..
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఎస్‌ఈడీ టిక్కెట్టున్న భక్తులకు తిరుమలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని స్నానాదులు ముగించేందుకు రూములు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ముందుగా ఒప్పందం చేసుకున్న హోటల్స్‌కు తీసుకెళ్లి అల్ఫాహారం పెట్టించడంతో పాటు నేరుగా దర్శనాలకు తీసుకెళతారు. అక్కడ తలనీళాలు, దర్శనాలు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి తీసుకొచ్చి భక్తులు కోరిన పక్షంలో లోకల్, నాన్ లోకల్ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ట్రిప్పులు నిర్వహించడం ద్వారా తీసుకెళతారు. ఇక్కడే భక్తుల వస్తువులు భద్ర పరుచుకునేందుకు లాకర్లు, సమాచారం, సాయం కోసం నిరంతరం పని చేసేలా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
వాస్తవానికి ఇప్పటికే ఏపీటీడీసీ ఈ తరహా సేవలను సొంత సిబ్బందితో తిరుమలలో నిర్వహిస్తోంది. అయితే సిబ్బంది కొరత, ఇతర కారణాలపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆయా కార్యక్రమాలు నిర్వహణ, సేవలు అందించేందుకు బీఎండీ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నారు. తద్వారా తిరుమలను సందర్శించే భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని ఏపీటీడీసీ అధికారులు చెపుతున్నారు. గతంలో ఈ తరహా టిక్కెట్లపై ఉన్న రేట్లతో పోల్చితే మరో రూ.300 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తున్నప్పటీకీ నూటికి నూరుపాళ్ల సేవలు అందుతాయని చెపుతున్నారు.