హైదరాబాద్, ఆంధ్రప్రభ : బాసర ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక వైద్య బృందాలను పంపించాలని, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్‌రావు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌తోపాటు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా… బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్నం భోజనం తర్వాత పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫ్రైడ్ రైస్ తిని వాంతులు, విరోచనాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వారందరినీ చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే కుళ్లిన కోడిగుడ్లతో ఫ్రైడ్ రైస్‌ను వండి వడ్డించడమే ఫుడ్ పాయిజన్‌కు కారణంగా తెలుస్తోంది. అనారోగ్యం పాలవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దాదాపు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.