హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగకు సొంతూళ్ల్లకు వెళ్లే ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. టోల్ ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్ కేటాయించాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఏఐ, తెలంగాణ ఆర్ అండ్ బి విభాగాలక లేఖ రాసింది. ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులను కూడా సంప్రదించింది. ఇందుకు అంగీకరించిన ఆయా విభాగాలు ఈనెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్ ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్ కేటాయించనున్నట్లు హామీ ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పంతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్-వరంగల్ మార్గంలోని గూడూరు, హైదరాబాద్-సిద్దిపేట మార్గంలోని దుద్దెడ, హైదరాబాద్-నిజామాబాద్ మార్గంలోని మనోహరాబాద్, హైదరాబాద్-కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు విధులు నిర్వర్తించనున్నారు.
కాగా, సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కంట్రోల్ కమాండ్ సెంటర్లను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షించడంతో పాటు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు.