గతేడాది ఇంటర్ ఫలితాలు ఈ సారి పునరావృతం కాకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏప్రిల్ లో విద్యార్థులు రాసే ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఈసారి మెరుగ్గా రాబట్టేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు సులువుగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేలా అందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విద్యార్థులకు ఈవారం నుంచి ముఖ్యమైన టాపిక్స్‌ను బోధించనున్నారు. టీశాట్, ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా సబ్జెక్టుల్లోని ముఖ్యమైన టాపిక్స్‌తో పాటు పరీక్షల్లో వచ్చే అవకాశం ఉన్న అతిముఖ్యమైన ప్రశ్నలను డిజిటల్ క్లాసుల ద్వారా వివరించనున్నారు. థియరీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల క్లాసులు ప్రతిరోజూ ప్రసారం కాగా, ప్రాక్టికల్స్ క్లాసులు మాత్రం ప్రతి ఆదివారం నిర్వహించేలా అధికారులు నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యా ర్థులు 9,59,585 మంది ఉన్నారు. వీరంతా ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు వార్షిక పరీక్షలకు హాజరుకాబోతున్నారు. కరోనా నేపథ్యంలో సరిగ్గా క్లాసులు జరగక గతేడాది నవంబర్‌లో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ఇంటర్ విద్యార్థులు చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఎప్పుడూ లేనంతగా 49 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ, గురుకుల జూనియర్ కాలేజీల్లోని వారే ఉన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఇలానే ఉంది. పరీక్షల్లో ఫెయిలయ్యారని మనస్థాపంతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో కొన్ని రోజుల వరకూ ధర్నాలు, నిరసనలు, ముట్టడి కార్యక్రమాలు జోరందుకున్నాయి.
ఈనేపథ్యంలో ఇక చేసేదేమిలేక ప్రభుత్వందిగొచ్చి ఫెయిల్ అయిన విద్యార్థులను మినిమం మార్కులతో పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాదిలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముఖ్యమైన ప్రశ్నలను టీశాట్ ద్వారా ప్రసారం చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రణాళికలు రచించారు. అందుకు ప్రతి సబ్జెక్టు నుంచి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రసారం చేయనున్నారు. అదేవిధంగా ఈసారి పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్‌లు ఇవ్వనున్నారు. ఉదాహరణకు గతంలో ఐదింటిలో మూడింటికి జవాబులు రాయాల్సి ఉంటే ప్రస్తుతం ఏడు ప్రశ్నలిచ్చి మూడింటికి జవాబు రాయాల్సి ఉంటుంది. గతంలో పదింటికి పది రాయాల్సి ఉంటే ఈసారి 15 ప్రశ్నలిచ్చి పది రాయమనే విధంగా ఛాయిస్‌లు ఉంటాయని బోర్డులోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..