Tuesday, November 19, 2024

TG | వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి స్పెషల్‌ డ్రైవ్ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వైద్య ఆరోగ్యశాఖలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా పేద, సామాన్యులకు సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖలో వై ద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు అనే మాట వినపడొద్దన్న సంకల్పంతో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టీ మరీ వైద్యులు మొదలు పారామెడికల్‌ సిబ్బంది వరకు వివిధ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గడిచిన 8 నెలల్లో 6956 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది.

రెండు రోజుల క్రితం 2050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవలే 285 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోద రాజనర్సింహా నియామక పత్రాలు అందజేశారు. తాజాగా మరో 1284 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ విడుదల చేశారు. త్వరలో వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

వివిధ వైద్య విభాగాల్లోని దాదాపు 6వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. అదే సమయంలో వైద్య, ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.4990 కోట్లతో వైద్య, ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో పలు వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

ఈ నిధులతో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతోపాటు కొత్తగా చచేపట్టే ఆరోగ్య సంరక్షణ పథకాల అమలుకు సంబంధించి అవసరమైన మానవ వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్‌ కేంద్రాలు మొదలుకుని మానవ వనరుల అభివృద్ధి, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించనుంది.

- Advertisement -

ప్రధానంగా జాతీయ రహదారులపై ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్‌ సెంటర్‌, డయాలసిస్‌ సెంటర్లు, వాస్క్యూలర్‌ యాక్సెస్‌ సెంటర్లు, అత్యవసర సేవలకు గాను సిమ్యులేషన్‌, స్కిల్‌ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సేవల పెంపు, అవయవాల సేకరణ, నిల్వ కేంద్రాల ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లోని టిమ్స్‌ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, క్యాన్సర్‌ కేర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన ప్రతీ చోట డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో డయాలసిస్‌, క్యాన్సర్‌ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాటిలోని యంత్రాలు సరిపోవడం లేదు. దీంతో అదనంగా మరిన్ని డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అదేవిధంగా.. టీ.డయాగ్నస్టిక్‌ హబ్‌ల కింద మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయబోతోంది. రోడ్డు ప్రమాదాలు, అనుకోకుండా ప్రాణహాని తలెత్తితే ఫోన్‌ చేసిన 8 నిమిషాల్లోపు అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకునే విధంగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందుకు మరో 100 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement