Wednesday, November 20, 2024

TS | స్పెషల్ డ్రైవ్.. ప్రతి పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల మేళా

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ :రాష్ట్రంలో పెండింగ్‌ కేసులను సత్వరమే విచారణ చేపట్టాలని, వివిధ కేసులలో నిందితులపై ఉన్న వారెంట్లను క్లియర్‌ చేయాలని అన్ని జిల్లాల ఎస్‌పిలకు డీజీపీ ఆదేశాలిచ్చారు. అదేవిధంగా కేసులలో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ బృందాలతో పలు కేసులలో పెండింగ్‌ వారెంట్లను క్లియర్‌ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్రవాప్తంగా పెండింగ్‌ కేసుల విచారణ, వారెంట్ల క్లియర్‌ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డీజీపీ ఇన ఆదేశాలలో పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు స్టేషన్‌లలో దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, కేసుల పురోగతి కోసం ఆయా కేసులను తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. అలాగే చిన్న చిన్న కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు నచ్చచెప్పాలని, ఇందులో ఒక వర్గం అంగీకరించని పక్షంలో ఆయా కేసులను వదిలేయాలన తెలిపారు.

పాత కేసులపై సమీక్ష :

రాష్ట్రంలో పెండింగ్‌ కేసులపై 33 జిల్లాల ఎస్‌పిలు ప్రతీవారం సమీక్ష నిర్వహించాలని, పాత కేసులు, వారెంట్లపై ఇక ప్రతీవారం నివేదిక సమర్పించాలని డీజీపీ తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఠాణాలలో పేరుకుపోయిన కేసులు, వారెంట్ల విషయంలో అలసత్వం వహించే పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్లకు, జిల్లా ఎస్‌పిలకు ఆదేశాలిచ్చారు.

అదేవిధంగా ఎన్నికల సమయంలో, గ్రామాలలో ఆధిపత్యం పోరు కారణంగా నమోదైన కేసులో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనూ కొన్ని కేసులు నమోదు అవుతున్న కేసులలో ఆధారాలు లేని పక్షంలో వాటిని న్యాయనిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

పేరుకుపోతున్న కేసులు :

రాష్ట్రంలో సంవత్సరానికి సగటు-న లక్షన్నర కేసులు నమోదవుతుండగా వాటిలో 5శాతం మేరకు పెండింగ్‌ కేసులుగా మారుతున్నాయని, కేవలం ఎస్‌హెచ్‌ఓల నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని ఎస్‌బి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలో సైబర్‌క్రైం,సిఐడి, సిసిఎస్‌లలోనూ పెండింగ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సైబర్‌ నేరాలలో నిందితులను పట్టుకోవడం కష్టతరంగా మారుతోందని, నిందితులు వివిధ రాష్ట్రాల, దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సైబర్‌ క్రైం స్టేషన్‌లలో వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా కేసు పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవర్‌ నిర్వహించాలని ఆదేశాలిచ్చారు.

పెండింగ్‌ కేసుల మేళా :

గతంలో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌ కేసుల మేళా నిర్వహించేవారని, తాజాగా ఈ తరహా మేళాలు రాష్ట్ర వాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నిర్వహించాలని పోలీసు బాసులు ఆదేశాలిచ్చారు. గత 24 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీసు శాఖలో పెండింగ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రతీ ఏటా పోలీసులు విడుదల చేసే నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో 2023 వరకు రాష్ట్రంలో పెండింగ్‌ కేసుల సంఖ్య దాదాపు 50 వేలకు చేరుకున్నట్లు సమాచారం. స్వల్ప, తీవ్రతర కేసులకు సంబంధించి ఏలాంటి ఆధారాలు లభించని పక్షంలో ఆ తరహా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

ఈ తరహా కేసులను గుర్తించి వెంటనే ఆ కేసుల రిపోర్టును న్యాయస్థానం ముందుంచాలని ఆదేశాలిచ్చారు. కాగా హైదరాబాద్‌ నగరంలో ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌ఓటి, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్న కేసులలో ఛార్జిషీట్‌ వేయడం, మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకోవాడంలో ఆయా పరిధిలోని పోలీస్టేషన్‌ల సిబ్బంది అలసత్వం చూపిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ తరహా కేసులు సైతం పెండింగ్‌ కేసుల జాబితాలో చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇకపై ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓలు పనిచేసిన కాలంలో పెండింగ్‌ కేసుల సంఖ్య అధికంగా ఉంటే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు. అలాగే పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించి జీరో పెండింగ్‌ కేసులుగా రిపోర్టులు అందితే ఆయా పోలీసు అధికారులకు రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వెరసి కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని పోలీసు బాసులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ వారంలో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లలో పెండింగ్‌ కేసుల మేళా నిర్వహించాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement