Saturday, November 23, 2024

Special Coach – వందే భార‌త్ రైళ్ల‌లో పెంపుడు జంతువుల‌కు ప్ర‌త్యేక బోగి..

హైదరాబాద్‌: ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు, వ‌యోవృద్ధుల‌కు, వికలాంగుల‌కు ప్ర‌త్యేక బోగీలు ఏర్పాటు చేసిన రైల్వే శాఖ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.. వందేభారత్‌ రైళ్ల తదుపరి వెర్షన్‌గా రాబోతున్నరైలులో పెంపుడు జంతువుల కంపార్ట్‌మెంట్‌ను చేరుస్తుండటం విశేషం. రైలులో ప్రయాణం చేసేవారు వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. 16 కోచ్‌లతో ఉండబోయే ఈ రైలులో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కోసం కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది. వాటి ఇంటీరియర్, ఎక్ట్సీరియర్‌లను అధికారికంగా రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసి ప్రజల్లో ఆసక్తి పెంచడం తెలిసిందే.

ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని..
దూర ప్రయాణాలు చేసే వారు ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్తుంటారు. పిల్లులు, కుక్కలు సహా ఇతర పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లటం ప్రస్తుతం చాలా ఇబ్బందిగా మారింది. లగేజీ కంపార్ట్‌మెంట్‌లో వాటిని తీసుకెళ్లేందుకు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తున్నా.. వాటిల్లో సరైన వ్యవస్థ ఉండటం లేదు. కొన్ని చోట్ల బుకింగ్‌ చేసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ప్రయాణికుల కోచ్‌లలో వాటిని తరలించాలంటే, వాటిల్లోని ఇతర ప్రయాణికుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అందరి అంగీకారం లభించటం అసాధ్యంగా ఉంటోంది.

జంతు ప్రేమికుల విజ్ఞప్తితో..
ఈ నేపథ్యంలో చాలా కాలంగా జంతు ప్రేమికుల నుంచి రైల్వేకు విన్నపాలు వస్తున్నాయి. ఇంతకాలం ఆ దిశగా దృష్టి సారించని అధికారులు ఇప్పుడు వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లలో అందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. లగేజీ కంపార్ట్‌మెంట్‌ పక్కన ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జంతువులను ఉంచేందుకు ప్రత్యేకంగా ర్యాక్స్‌ ఉంటాయి. అక్కడ వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉంటారు. ప్రయాణికుల కోచ్‌లతో ఈ కంపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా ఉంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ రైళ్లు రూపొందుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు అందుబాటులోకి రానుంది. ఇక్కడ తొలుత పది రైళ్లు రూపొందిస్తారు. ఆ తర్వాత రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో కలిసి రష్యాకు చెందిన కీనెట్‌ రైల్వే సొల్యూషన్స్‌ 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూరులోని కోచ్‌ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement