బెంగళూరు – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల పంపిన ఉపగ్రహాలను డాకింగ్ (అనుసంధానం) చేసి ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. ఇస్రో గత నెల 30న పీఎస్ఎల్వీ ద్వారా రెండు చిన్న ఉపగ్రహాలు ఎస్‌డీఎక్స్01 (చేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్)లను కక్ష్యలోకి పంపింది. అంతరిక్షంలో మనకంటూ స్పేస్ స్టేషన్ నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో డాకింగ్ ఎంతో కీలకం.
నింగిలోకి పంపిన ఉపగ్రహాలను డాకింగ్ చేసేందుకు ఇస్రో మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 12 ఈ రెండు ఉపగ్రహాలను మూడు మీటర్ల దూరానికి తీసుకొచ్చినప్పటికీ అనుసంధానం వాయిదా పడింది. తాజాగా, ఉపగ్రహాల డాకింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో ప్రకటించింది.
ఈ విజయంతో డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ప్రస్తుతం ఈ సాంకేతికత అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. చంద్రుడిపై నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురావడం, అంతరిక్షంలో భారత్ సొంత స్సేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపడం వంటి లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు.