అంతరిక్షం నుంచి ఓ క్యాప్సూల్ బుల్లెట్ కంటే 15 రెట్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఒసిరిస్ రెక్స్ అనే ఈ క్యాప్సూల్‌లో ఓ గ్రహశకలానికి సంబంధించిన రాళ్లు, ధూళి ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒసిరిస్ రెక్స్ అనే ఈ నాసా వ్యోమనౌక బెన్నూ గ్రహశకలానికి చెందిన శిథిలాలను సేకరించింది. అందుకు సంబంధించి ఐదు సెక్లన వీడియోను వ్యోమనౌక కెమెరా రికార్డు చేసింది. ఇది దాదాపు నాలుగేళ్ల ప్రయాణం తర్వాత భూమి మీదకు వస్తోంది. అది తీసుకొచ్చే రాళ్లను, ధూళిని పరిశీలించడం ద్వారా కొన్ని లక్షల కోట్ల ఏళ్ల క్రితం భూ గ్రహం ఎలా ఏర్పడిందో తెలుసుకునే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐదు వందల మీటర్ల వెడల్పున్న బెన్ను అనే గ్రహశకలం అంతరిక్షంలో తిరుగుతోంది. భూమికి ప్రమాదకరమైన గ్రహశకలాలపై నాసా విడుదల చేసిన జాబితాలో ఇది మొదటి స్థానంలో ఉంది. ఈ గ్రహశకలం ఆధారంగా భూమి పుట్టుక తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దాంతో నాసా ఈ గ్రహశకలంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 250 గ్రాముల దుమ్ము, రాళ్లతో వస్తున్న ఈ వ్యోమనౌక ల్యాండయ్యేందుకు విశాలమైన ఎడారి ప్రాంతాన్ని ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు.
భూమి వాతావరణంలో క్యాప్సూల్ వేగం గంటకు 43 వేల కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది. భూమిపై ల్యాండ్ అయ్యే క్రమంలో మూడు వేల డిగ్రీల ఉష్ణోగ్రతలను ఇది తట్టుకోవాలి. పారాచ్యూట్‌ల ద్వారా దాని వేగం తగ్గుతుంది. కిందకు వచ్చాక గ్రహశకలాలున్న క్రాఫ్ట్‌ను జాగ్రత్తగా ఎలా తెరవాలో శాస్త్రవేత్తలు ప్రాక్టీస్ చేస్తున్నారు.