హైదరాబాద్, ఆంధ్రప్రభ : తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో సతమతవుతున్న తెలంగాణ ప్రజలకు ఊరట కలిగించే వార్త. మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సోమవారం నుంచి క్రమంగా వడగాలలు, వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని చెప్పారు. ప్రస్తుతం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని, ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణలోనికీ ప్రవేశించే అవకాశముందని తెలిపారు. ఈ నెల 18, 19 దాకా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించవని పలు సంస్థలు చెబుతున్నట్లుగా పరిస్థితులు ఉండకపోవచ్చన్నారు. మొత్తానికి రెండు, మూడు రోజుల్లో తెలంగాణను తొలకరి పలకరిస్తుందని, ఆ తర్వాత రుతుపవనాలతో సమృద్ధిగా వర్షం కురుస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాల్సి ఉందన్నారు.
మూడు రోజులు వర్ష సూచన…
రుతుపవనాలతో నిమిత్తం లేకుండా తెలంగాణకు రాగల మూడు రోజుల్లో వర్షసూచన ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించడంతో దిగువస్తాయిలోని గాలులు పశ్చిమదిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని తెలిపింది.
రుతుపవనాల రాకకు మరో రెండు రోజుల సమయం పట్టనున్న నేపథ్యంలో రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో వడగాలలు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమరంభీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలలు వీస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ 41.8 డిగ్రీలు, భద్రాచలంలో 41.6, హకీంపేటలో 37.5, దుండిగల్‌లో 38.4, హన్మకొర్డలో 40.5 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39.2 డిగ్రీలు, ఖమ్మంలో 42.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 37.9 డిగ్రీలు, మెదక్‌లో 40.6 డిగ్రీలు, నల్గొండవలో 40.1 డిగ్రీలు, నిజామాబాద్ 40.1 డిగ్రీలు, రామగుండంలో 42.2 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి…
ఇప్పటికే తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశించిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ఆగమనంతో రాయలసీమతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి ప్రస్తుతం శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి రత్నగిరి, శివమెగ్గ, హసన్ ప్రాంతాల్లో విస్తరించాయని వివరించింది.