హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు మే నెలాఖారుకే కేరళను తాకనున్నట్లు అధికారులు వివరించారు.
ఆ తర్వాత కేరళ నుంచి ఏపీ లోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం అయిదారు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి జూన్ 5 నుంచి 8తేదీల మధ్యన ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఒకవేళ ఆలస్యమైనా జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని స్పష్టం చేసింది. గతేడాది రుతుపవనాలు కేరళకే జూన్ 11న వచ్చాయని, అందుకే తెలంగాణలో జూన్ 20 తర్వాతే రుతుపవనాలు విస్తరించాయని వివరించింది. ప్రస్తుతం మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది.
ఐదు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మే 26 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం తెలంగాణలోని ఉత్తరాది జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే 24న కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.
కామారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్‌లో శనివారం వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం సంగారెడ్డి, మెదక్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
మళ్లి పెరగనున్న ఉష్ణోగ్రతలు…
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వారం పాటు వాతావరణం చల్లబడినా మరోసారి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం వర్షాలు ఆగిపోవడంతోపాటు ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని వివరించింది. ఉష్ణోగ్రతలు మళ్లీ 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో మళ్లీ వడగాలులు మొదలవుతాయంటున్నారు. వేసవిలో ఇదే చివరి దశ అని పేర్కొన్నారు.
అయితే, వచ్చే నాలుగు రోజులు మాత్రంహైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటు-ందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 24 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.