హైదరాబాద్, ఆంధ్రప్రభ : తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న ప్రజలు, పత్తి, ఇతర వర్షాధార పంట విత్తనాలు విత్తి వర్షం కోసం ఎదురుచూస్తున్న, వర్షం పడితే విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులకు శుభవార్త. మరో 48గంటల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. బుధవారం దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. రుతుపవనాలు ముందుగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, గద్వాల, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. ఈ నెల 21న గురువారం రాష్ట్రంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈ నెల 26 కల్లా తెలంగాణ మొత్తం విస్తరిస్తాయని తెలిపింది.
ఈసారి సాధారణం కంటే కొద్దిపాటి అధికంగా వర్షాలు… ఎల్‌నినో పరిస్థితులే కారణం..
రెండు వారాలు ఆలస్యమైనప్పటికీ ఈ నెల 26కల్లా తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి సాధారణం కంటే అధిక వర్షాలే కురిపిస్తాయని స్కైమేట్ వాతావరణ నిపుణులు చెబుతున్నారు.అయితే గత నాలుగేళ్లలో వానాకాలంలో కురిసినంత వర్షాపాతం ఈ సారి కురవకపోవచ్చని అంచనా వేసింది. ఎల్‌నినో పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణంగా స్కైమేట్ స్పస్టం చేసింది. సాధారణంగా ఎంత ఆలస్యమైనప్పటికీ ప్రతి ఏటా తెలంగాణలోకి జూన్ 10న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నాలుగేళ్ల క్రితం అంటే 2019లో మాదిరిగా జూన్ 21న ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు వారాలపాటు నైరుతి ఆగమనంలో ఆలస్యం చోటు చేసుకుంది. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణకు నైరుతి ఆగమనాన్ని పరిశీలిస్తే 2019లో జూన్ 21న, 2020లో జూన్ 11న, 2021లో జూన్5న, 2022లో జూన్ 13న తెలంగాణలోకి ప్రవేశించాయి.
రాగల మూడు రోజులపాటు వర్షాలు…
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ నెల 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 23 వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ, ఈ నెల 24న జిల్లాల్లో కొన్ని చోట్ల, ఈనెల 25 పలు జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనా నివేదికలో పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
గడిచిన 24గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు…
రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 40.3, భద్రాచలంలో 41.2, హకీంపేటలో 36.4, దుండిగల్‌లో 37.6, హన్మకొండలో 39.5, హైదరాబాద్‌లో 37.8, ఖమ్మంలో 42.2 డిగ్రీలు, మహబూౖౖబ్‌నగర్‌లో 38.2 డిగ్రీలు, మెదక్‌లో 39.6, నల్గొండలో 41, నిజామాబాద్‌లో 39.9 డిగ్రీలు, రామగుండంలో 41.2 డిగ్రీల ఎండలు కాచాయి.