హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేరళ రాష్ట్రానికి తాకిన నైరుతి రుతుపవనాలు ఈనెల 7న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వానాకాలంలో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముందుగా అంచనా వేసిన దానికంటే అధికంగానే వానలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహోపాత్ర చెప్పారు. దీర్ఘకాలం సగటుకు 103 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏప్రిల్‌లో దీర్ఘకాల సగటులో 99 శాతం వానలు పడే అవకాశం ఉందని భావించినా తాజాగా రుతుపవనాలు కదలికలు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో 103 శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. దేశంలోని చాలా వరకు భూభాగంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని సాధారణంగా జూన్ 1న కేరళకు రావలసిన నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే వచ్చాయని చెప్పారు.
వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఈనెల 29న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళతో పాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని పేర్కొంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కర్నాటకలోని కొంకన్, గోవా ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చండూర్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో 3.3 సెంటిమీటర్లు, ఖమ్మం జిల్లా కొణిజర్లలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. అత్యధికంగా కోల్‌బెల్ట్ ప్రాంతమైన రామగుండంలో పగటిపూట 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు శివార్లలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో వాన దంచి కొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భానుడి భగ భగలతో అల్లాడిపోయిన నగర ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. వచ్చే రెండు రోజులు హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.