హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ ఏడాది దేశంలోకి నైరుతి రుతు పవనాలు గత సంవత్సరంకన్నా ముందే ప్రవేశించనున్నాయి. తొలుత అండోమాన్ నికోబార్ దీవులను రుతు పవనాలు తాకుతాయని ఈనెల 15న ఆ ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట లభించనుంది. రుతు పవనాలు ఈ ఏడాది కేరళలో కూడా ముందుగానే ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది 15 రోజుల ముందుగానే (ఈనెల 15న) దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.
ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేసింది. 96 నుంచి 104 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు, వాయువ్య దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి